New Delhi, DEC 19: మహిళల మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన ప్రతిష్ఠాత్మక చివరి మ్యాచ్‌లో (IND-W vs WI-W) భారత్ విజయ ఢంకా మోగించింది. 60 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించింది. 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 157 పరుగులకే పరిమితమైంది. విండీస్ మహిళలు భారత్‌కు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు. రాధా యాదవ్ (Radha Yadav) 4 వికెట్లు తీసి.. వెస్టిండీస్ ఆశలపై నీళ్లు చల్లింది. రేణుక, సజన, సాధు, దీప్తి తలో వికెట్ తీశారు.
భారత్ బ్యాటర్లలో కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) (77; 47 బంతుల్లో 13×4,1×6), రిచా ఘోష్ (54; 21 బంతుల్లో 3×4, 5×6) అర్ధశతకాలతో మెరిశారు. రోడ్రిగ్స్ (39), బిస్త్ (31*) కీలక ఇన్నింగ్స్ ఆడారు. వెస్టిండీస్ బౌలర్లలో హెన్రీ, డాటిన్, ఫ్లెచర్, అలెయ్‌నే తలో వికెట్ తీశారు. బ్యాటింగ్ దిగిన భారత్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ చివరి బంతికే ఓపెనర్ ఉమా ఛెత్రి (0) డకౌట్ అయ్యింది. హెన్రీ బౌలింగ్‌లో జోసెఫ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రోడ్రిగ్స్‌తో కలిసి కెప్టెన్ మంధాన ఇన్నింగ్స్ నిర్మించింది. క్రీజులో నిలదొక్కుకుంటూ.. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించింది.
India Beat West Indies in 3rd T20I, Win Series 2-1
3RD WT20I. India (Women) Won by 60 Run(s) https://t.co/Fuqs85UJ9W #INDvWI @IDFCFIRSTBank
— BCCI Women (@BCCIWomen) December 19, 2024
జోరుమీద ఉన్న ఈ జోడీని ఫ్లెచర్ విడగొట్టింది. జట్టు స్కోరు 99 పరుగుల వద్ద రోడ్రిగ్స్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. అక్కడికి స్వల్ప వ్యవధిలోనే మంధాన కూడా డాటిన్ బౌలింగ్‌లో హెన్రీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరింది. చివర్లో రిచా ఘోష్, బిస్త్ దూకుడుగా ఆడటంతో భారత్ భారీ స్కోరే చేసింది. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లో ఇరు దేశాలూ చెరో విజయం సాధించాయి. దీంతో సిరీస్‌ను సొంతం చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.