మహిళల టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ ముంగిట ఓడిన భారత జట్టు (Team India) త్వరలోనే సొంతగడ్డపై వన్డే సిరీస్ ఆడనుంది.UAE లో వరల్డ్ కప్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్ (Newzealand)తో వన్డే సమరం మొదలవ్వనుంది. ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్ (ICC Womens Championship)లో భాగంగా టీమిండియా దాంతో, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) షెడ్యూల్‌ను ప్రకటించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈ మూడు మ్యాచ్‌లకూ ఆతిథ్యం ఇవ్వనుందని బీసీసీఐ వెల్లడించింది.
న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా.. టీమిండియా అక్టోబర్ 24న మంగళవారం మొదటి వన్డే ఆడనుంది. అనంతరం అక్టోబర్ 27న రెండో వన్డే, అక్టోబర్ 29వ తేదీన మూడో వన్డే జరుగనున్నాయి. భారత కాలమానం ప్రకారం(IST) మధ్యాహ్నం 1:30 గంటలకు మూడు వన్డేలు ప్రారంభం అవుతాయి. ఈ మూడు మ్యాచ్‌లు కూడా నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానుంది’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
తొలి వన్డే : అక్టోబర్ 24 – మధ్నాహ్నం 1:30 గంటలకు – నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్.
రెండో వన్డే : అక్టోబర్ 27 – మధ్నాహ్నం 1:30 గంటలకు – నరేంద్ర మోడీ స్టేడియం
మూడో వన్డే : అక్టోబర్ 29 – మధ్నాహ్నం 1:30 గంటలకు – నరేంద్ర మోడీ స్టేడియం
ఈ సిరీస్ మన అమ్మాయిలకు ఎంత ముఖ్యమో కివీస్‌కు కూడా అంతే ముఖ్యం. వచ్చే ఏడాది మహిళల వన్డే వరల్డ్ కప్ పోటీలకు అర్హత సాధించాలంటే న్యూజిలాండ్ జట్టు గెలిచి తీరాల్సిందే. ప్రస్తుతానికైతే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు వరల్డ్ కప్ బెర్తు సొంతం చేసుకున్నాయి.
ఇదిలా ఉంటే న్యూజిలాండ్ మహిళల, పురుషుల జట్లు భారత పర్యటనకు రాబోతున్నాయి. టీమిండియాతో మూడు టెస్టుల సిరీస్ కోసం పురుషుల జట్టు రానుంది. శ్రీలంకపై రెండు టెస్టుల్లో ఓడిపోయి 2-0తో సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్ భారత గడ్డపై మళ్లీ గెలుపు బాట పట్టాలనే కసితో ఉంది. అయితే.. కీలకమైన ఈ పర్యటనకు మాజీ సారథి కేన్ విలిమయ్సన్ (Kane Williamson) అందుబాటులో ఉండడం లేదు. ఇరు జట్ల మధ్య అక్టోబర్ 16 నుంచి తొలి టెస్టు మొదలవ్వనుంది.