IPL 2020 Dates Announced: యూఏఈలో ఐపీఎల్ 13, సెప్టెంబర్‌ 19నుంచి ప్రారంభం, ఈ ఏడాది ఐపీఎల్ రద్దు చేస్తే రూ. 4 వేల కోట్ల నష్టం, మరిన్ని వివరాలు కథనంలో..
File picture of IPL trophy (Photo Credits: PTI)

క్రికెట్‌ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-13వ సీజన్‌పై ఉత్కంఠ వీడింది. ఎట్టకేలకు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) షెడ్యూల్‌పై స్పష్టత (IPL 2020 Dates Announced) వచ్చింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(UAE) వేదికగా సెప్టెంబర్‌ 19న లీగ్‌ ఆరంభంకానుందని (Scheduled to Begin on September 19 in UAE) నవంబర్‌ 8న ఫైనల్‌తో టోర్నీ ముగియనుందని ఐపీఎల్‌ ఛైర్మన్‌బ్రిజేష్‌‌ పటేల్‌ (Brijesh Patel) శుక్రవారం క్లారిటీ ఇచ్చారు. ఈసారి పూర్తిస్థాయి టోర్నమెంట్‌ను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది జరగాల్సిన టీ20 క్రికెట్ ప్రపంచ కప్ వాయిదా, అధికారికంగా ప్రకటించిన ఐసీసీ, ఐపీఎల్ 2020 నిర్వహణకు లైన్ క్లియర్

వచ్చే వారం జరిగే ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌లో పూర్తి వివరాలు చర్చించడంతో పాటు తుది షెడ్యూల్‌పై ఆమోద ముద్ర వేయనున్నారు. అయితే ఇప్పటికే ఈ విషయమై ఆయా ఫ్రాంచైజీలకు సమాచారమిచ్చారు. ‘ఐపీఎల్‌ సెప్టెంబరు 19 నుంచి 51 రోజుల పాటు జరిగి నవంబరు 8న ముగుస్తుంది. ఈ కుదించిన షెడ్యూల్‌.. జట్లతో పాటు బ్రాడ్‌కాస్టర్లు, వాటాదారులకు కూడా అనుకూలంగా ఉండనుంది. యూఏఈలో జరిగే ఈ టోర్నీ కోసం ఆటగాళ్లంతా క్వారంటైన్‌.. తగిన శిక్షణ కోసం ఆగస్టు 20నే అక్కడికి వెళతారు. ఏడు వారాలపాటు జరగబోయే ఐపీఎల్‌లో ఇంతకుముందు అనుకున్నట్టుగానే ఐదు డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లుండబోతున్నాయి’ అని బోర్డు అధికారి తెలిపాడు.

నిజానికి సెప్టెంబరు 26 నుంచి ఐపీఎల్‌ జరుగుతుందని అంతా భావించారు. కానీ ఈ షెడ్యూల్‌ అటు ఆసీస్‌ పర్యటనకు ఇబ్బంది కలిగిస్తుండడంతో వారం రోజుల ముందుకు జరిపినట్టు సమాచారం. కాగా 'స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించాలా వద్దా అనేది యూఏఈ ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా భౌతిక దూరం ప్రతిఒక్కరూ పాటించాల్సిందే. దీనిపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఆ ప్రభుత్వానికి వదిలేశాం. అధికారికంగా యూఏఈ బోర్డుకు కూడా లేఖ రాయనున్నట్లు' పటేల్‌ తెలిపారు. యూఏఈలో మూడు క్రికెట్‌ మైదానాలు అందుబాటులో ఉన్నాయి. దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం, షేక్‌ జాయేద్‌ స్టేడియం(అబుదాబి), షార్జా గ్రౌండ్‌లో ఐపీఎల్‌ నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.

ఈ ఏడాది ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ను ర‌ద్దు చేస్తే బీసీసీఐకి సుమారు రూ. 4 వేల కోట్ల న‌ష్టం వాటిల్లే అవ‌కాశం ఉన్న‌ట్లు ఓ నివేదిక ద్వారా వెల్ల‌డైంది. టోర్న‌మెంట్ నిర్వ‌హ‌ణ వెనుక ఉన్న వాస్త‌వాల‌పై ఓ ప‌త్రిక త‌న క‌థ‌నంలో ఈ విష‌యాల‌ను వెల్ల‌డించింది. ఐపీఎల్‌ను నిర్వ‌హిస్తే బీసీసీఐకి మీడియా హ‌క్కుల రూపంలో 3300 కోట్లు వ‌స్తాయి. టైటిల్ స్పాన్స‌ర్ వీవో నుంచి 440 కోట్లు కూడా బీసీసీఐకి అందుతాయి. ఇక ఇత‌ర స్పాన్స‌ర్ల నుంచి మ‌రో 170 కోట్లు బీసీసీఐ ఖ‌జానాలో చేర‌నున్నాయి. ఇప్ప‌టికే స్టార్ గ్రూపు రెండు వేల కోట్ల అడ్వాన్స్ చెల్లించింది. ఒక‌వేళ ఈ ఏడాది ఐపీఎల్‌ను ర‌ద్దు చేస్తే.. ఈ అంశంలో కోర్టు చుట్టు తిర‌గాల్సి వ‌స్తుందని ఆ పత్రిక తెలిపింది.