IPL 2020 Sponsor: ఐపీఎల్-2020 స్పాన్సర్‌షిప్, రేసులో బాబా రాందేవ్ పతంజలి గ్రూపు, బిడ్డింగ్‌లో పాల్గొనే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపిన సంస్థ ప్రతినిధి ఎస్ కె టిజరవాలా
File pictures of Baba Ramdev and IPL trophy (Photo Credits: IANS)

ఐపీఎల్-2020 స్పాన్సర్‌షిప్ నుంచి చైనా మొబైల్ కంపెనీ వివో తప్పుకున్న నేపథ్యంలో రేసులోకి యోగా గురువు బాబా రాందేవ్‌కు (Baba Ramdev) చెందిన ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి (Patanjali Ayurved) వచ్చింది. తన ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకొచ్చే వ్యూహంలో పంతాంజలి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ (IPL 2020 Sponsor) కోసం ప్రయత్నిస్తోంది. ఈ అంశాన్ని తాము పరిశీలిస్తున్నామంటూ ప్రతినిధి ఎస్ కె టిజరవాలా ధృవీకరించారు. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆగస్టు 14 లోగా తన ప్రతిపాదనను సమర్పించాల్సి ఉందని చెప్పారు.

వీవో గుడ్ బై చెప్పిన త‌ర్వాత ఐపీఎల్ స్పాన్స‌ర్‌షిప్ టైటిల్ కోసం జియో, అమెజాన్‌, టాటా గ్రూప్‌, డ్రీమ్ 11, బైజూస్ లాంటి సంస్థ‌లు పోటీలో నిలిచాయి. ఐపీఎల్ స్పాన్స‌ర్‌షిప్ నుంచి వీవో వెళ్లిపోవ‌డాన్ని ఆర్థిక సంక్షోభంగా చూడ‌రాదు అని బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ తెలిపారు. త‌మ వ‌ద్ద ప్లాన్ బీ ఉన్న‌ట్లు కూడా గంగూలీ చెప్పిన విష‌యం తెలిసిందే. యూఏఈలో ఐపీఎల్ 13, సెప్టెంబర్‌ 19నుంచి ప్రారంభం, ఈ ఏడాది ఐపీఎల్ రద్దు చేస్తే రూ. 4 వేల కోట్ల నష్టం, మరిన్ని వివరాలు కథనంలో..

ఇదిలా ఉంటే ఐపీఎల్ స్పాన్సర్ షిప్ కోసం 2018లో వివో 5 ఏళ్ళకు ఒప్పందం చేసుకుంది. 2018– 2022 కాలానికి గానూ రూ. 2199 కోట్లు చెల్లించేలా బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్‌గా వివో 2022 వరకు కొనసాగాల్సి ఉంది. అయితే కరోనా, బాయ్‌కాట్ చైనా వంటి పరిస్థితుల నేపథ్యంలో బీసీసీఐ వివోను స్పాన్సర్ షిప్ నుంచి సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో కొత్త స్పాన్సర్ల కోసం బిడ్డింగ్ నిర్వహించనుంది. ఈ బిడ్డింగ్‌లో పతంజలి కూడా పాల్గొననుంది.

కాగా చైనా మొబైల్‌ సంస్థ ‘వివో’ ఈ ఏడాది ఐపీఎల్‌ స్పాన్సర్‌ షిప్‌ నుంచి తప్పుకున్నంత మాత్రాన బోర్డు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోదని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశాడు. ఒక వెబినార్‌లో అతడు మాట్లాడుతూ ‘నేను దీన్ని పెద్ద ఆర్థిక నష్టంలా భావించడం లేదు. ఇది కేవలం తాత్కాలిక సమస్య మాత్రమే. గత బోర్డు పాలకులు, మేటి ఆటగాళ్లు బీసీసీఐకి పటిష్ట పునాదులు వేశారు. అప్పుడపుడు ఎదురయ్యే సమస్యల్ని బలమైన బోర్డు ఎప్పట్లాగే అధిగమిస్తుందని తెలిపారు.