క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ షెడ్యూల్‌ను (IPL 2021 Schedule Announced) ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆదివారం విడుదల చేసింది. దేశంలోని ఆరు వేదికల్లో (అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా) ఈ టోర్నీ జరగనుంది. అయితే మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేసినా.. హైదరాబాద్‌కు మాత్రం బీసీసీఐ అవకాశం ఇవ్వలేదు. 14వ సీజన్ ఏప్రిల్ 9న చెన్నైలో జరిగే తొలి మ్యాచ్‌తో ప్రారంభం కానుంది.
ఈ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ( Mumbai Indians vs Royal Challengers) తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ టోర్నీ మొత్తం 52 రోజుల పాటు 60 మ్యాచ్‌లుగా జరగనుంది. టోర్నీ ప్లే ఆఫ్ మ్యాచ్‌లతో పాటు, ఫైనల్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్నాయి.
ఇక ఫైనల్ మే 30న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ప్లేఆఫ్ మ్యాచ్‌లు కూడా ఇదే స్టేడియంలో జరగనున్నాయి. ప్రతి టీమ్ నాలుగు వేదికల్లో మ్యాచ్‌లు ఆడనుంది. మొత్తం 56 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు తలా 10 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుండగా, అహ్మదాబాద్, ఢిల్లీ చెరో 8 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ సీజన్ ప్రత్యేకత ఏంటంటే అన్ని టీమ్స్ తటస్థ వేదికల్లోనే మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఏ టీమ్ కూడా హోమ్ గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడబోవడం లేదు. మ్యాచ్‌లు మధ్యాహ్నం 3.30 గంటలకు, రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతాయి.
Here's Schedule for the IPL 2021
Schedule for the IPL 2021: pic.twitter.com/2MQM4x2uEd
— Johns. (@CricCrazyJohns) March 7, 2021
ఐపీఎల్ (IPL 14) ప్రారంభమైన తర్వాత తొలిసారి ఇండియాలో హోమ్/ అవే మ్యాచ్‌లు ఉండబోవడం లేదు. అన్ని టీమ్స్ కేవలం తటస్థ వేదికలపైనే ఆడనున్నాయి. ఈసారి ఆరు వేదికల్లో (అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా) మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తన మ్యాచ్‌లను చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులలో ఆడనుంది.
చెన్నైలో జరగబోయే ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌తోపాటు ప్రారంభంలోని కొన్ని మ్యాచ్‌లకు అభిమానులను అనుమతించడం లేదు. మిగతా మ్యాచ్‌లకు కూడా అనుమతించాలా లేదా అన్నదానిపై తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. నిజానికి ఈ మధ్యే ముగిసిన ఇండియా, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో రెండో మ్యాచ్ నుంచి అభిమానులను అనుమతిస్తున్నారు. ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఉన్న రోజులు మొత్తం 11. ఇందులో ఆరు జట్లు మూడేసి మధ్యాహ్నం మ్యాచ్‌లను ఆడనుండగా.. రెండు జట్లు రెండేసి మధ్యాహ్నం మ్యాచ్‌లు ఆడతాయి.