IPL 2021: శిఖర్ ధావన్ దాడి.. పంజాబ్‌పై దిల్లీ గెలుపు, హ్యాట్రిక్ విజయాలతో తగ్గేదేలే అంటున్న కోహ్లీ సేన, ఈరోజు చెన్నై మరియు రాజస్థాన్ మధ్య ఆసక్తికర మ్యాచ్
IPL Trophy (Photo Credits: Twitter/IPL)

Mumbai, April 19: నిన్న ఆదివారం జరిగిన రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చే వినోదాన్ని పంచాయి. మొదటగా సాయంత్రం బెంగళూరు మరియు కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్ లో బెంగళూరు రికార్డ్ విజయం నమోదు చేయగా, ఆ తర్వాత పంజాబ్ మరియు ఢిల్లీ మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో పంత్ సేన పంజాబ్‌కు షాక్ ఇచ్చింది.

మొదటి మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వ్యూహాత్మకమైన దూకుడును ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగిన కెఫ్టెన్ విరాట్ కోహ్లీ 5 పరుగులకే ఔట్ అయ్యాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. అయితే ఆపై మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన మాక్స్‌వెల్ నుంచి బెంగళూరు కోత మొదలుపెట్టింది.  కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడిన మాక్స్  9 ఫోర్లు, 3 సిక్సర్ర్లు బాది 49 బంతుల్లో 78 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరోవైపు ఏబి డివిలియర్స్ కూడా నేనేం తక్కువ కాదు అన్న స్థాయిలో అంతకుమించి చెలరేగాడు. 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 బంతుల్లోనే డివిలియర్స్ 76 పరుగులు చేశాడు. వీరిద్దరి దంచుడుతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 204/4 స్కోర్ చేసింది.

అనంతరం భారీ లక్ష్యంతో రన్ చేజ్ ప్రారంభించిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఎక్కడా కూడా గట్టి పోటీనివ్వలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 166 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 38 పరుగుల తేడాతో విజయం బెంగళూరు సొంతమైంది. ఇక ఈ విజయంతో ఐపీఎల్ 2021లో బెంగళూరు హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

దీని తర్వాత జరిగిన రెండో మ్యాచ్‌లో టాస్ గెలిచిన దిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకొంది. దీంతో బ్యాటింగ్ ఆరంభించిన పంజాబ్ కింగ్స్ ధాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. ఒపెనర్లు కేఎల్ రాహుల్ (61 పరుగులు), మయాంక్ అగర్వాల్ (69 పరుగులు) ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకొని తొలి వికెట్ కు 122 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే ఒపెనర్లు ప్రదర్శించిన జోరును తర్వాత బ్యాట్స్‌మెన్ కొనసాగించలేకపోయారు. 200 దాటుందనుకున్న పంజాబ్ స్కోర్, ఆ మార్కును చేరుకోలేకపోయింది. అయినప్పటికీ భారీ స్కోరునే సాధించింది. పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది.

అనంతరం 196 పరుగుల లక్ష్యంతో రన్ చేజ్ ప్రారంభించిన దిల్లీ క్యాపిటల్స్ కూడా ధాటిగా జవాబిచ్చింది. ముఖ్యంగా ఒపెనర్‌గా వచ్చిన శిఖర్ ధావన్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 49 బంతుల్లోనే 92 పరుగులు చేసి కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మరో ఒపెనర్ పృథ్వీ షాహ్ 32 పరుగులు, చివర్లో స్టోనిస్ మెరుపులు (13 బంతుల్లో 27) తోడవడంతో దిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలోనే 198 పరుగులు చేసి అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ సీజన్ లో రెండో విజయాన్ని నమోదు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో బెంగళూరు తర్వాత రెండో స్థానంలో కొనసాగుతోంది.

ఇక ఈరోజు ఈ సీజన్లో చెరొక విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న చెన్నె సూపర్ కింగ్స్ మరియు 5వ స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. సాయంత్రం 7:30కి ముంబై వాంఖడే స్టేడియంలో మ్యాచ్ ప్రారంభమవుతుంది.