ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డే నేటికి వాయిదా పడిన సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో సీఎస్‌కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను చూసి గుజరాత్ టైటాన్స్ వణికిపోతోంది. ఈ సీఎస్‌కే ఓపెనర్ ఐపీఎల్‌లో గుజరాత్‌తో ఆడిన 4 మ్యాచ్‌ల్లో 4 అర్ధ సెంచరీలు బాదాడు. దీంతో ఈ సారి ఏం బాదుడు బాదుతాడోనని గుజరాత్ వణుకుతోంది.
క్వాలిఫయర్-1లో 44 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 60 పరుగులు చేసిన రుతురాజ్.. ఈ సీజన్ ఓపెనర్‌లో 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అంతకుముందు సీజన్‌లో తొలి మ్యాచ్‌లో 48 బంతుల్లో 73 పరుగులు చేసిన గైక్వాడ్.. ఆ తర్వాతి మ్యాచ్‌లో 49 బంతుల్లో 53 పరుగులు చేశాడు. మొత్తంగా రుతురాజ్ ఐపీఎల్‌లో గుజరాత్‌తో ఆడిన 4 మ్యాచ్‌ల్లో 4 అర్ధసెంచరీలు సాధించి 278 పరుగులు స్కోర్ చేశాడు. ఐపీఎల్‌లో మరే ఆటగాడు గుజరాత్‌పై ఇన్ని పరుగులు చేయలేదు.ఈ నేపథ్యంలో నేటి ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇదే రికార్డు గుజరాత్ బౌలర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.
కాగా ఇవాళ జరగాల్సిన ఫైనల్ మ్యాచ్‌కు మరోసారి వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. అహ్మదాబాద్‌లో ఇవాళ కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. సాయంత్రం వేళ జల్లులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని సమాచారం.