IPL 2024 Auction: ఐపీఎల్‌-2024 వేలం తేదీ వచ్చేసింది, డిసెంబర్‌ 19న దుబాబ్‌ వేదికగా ఐపీఎల్‌ వేలం, ఈ సారి ఐపీఎల్‌పై భారీ పెట్టుబడి పెట్టనున్న సౌదీ
IPL Trophy (Photo credit: iplt20.com)

ఐపీఎల్‌-2024 సీజన్‌కు సంబంధించిన మినీ వేలానికి ముహూర్తం ఖారారైంది. డిసెంబర్‌ 19న దుబాబ్‌ వేదికగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ వేలం జరగనుంది. అదే విధంగా ఈవెంట్‌లో భాగమయ్యే మొత్తం 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ రిటైన్, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను నవంబర్ 26 నాటికి ఐపీఎల్ కమిటీకి సమర్పించాలి. కాగా ఐపీఎల్‌ వేలం భారత్‌లో కాకుండా బయట దేశంలో జరగడం ఇదే తొలి సారి.

కాగా ఈ సారి వేలంలో ఒక్కో ఫ్రాంచైజీ పర్స్‌ విలువను 5 కోట్లు పెంచాలని ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో ఆయా ఫ్రాంచైజీల పర్స్‌ వాల్యూ రూ. 95 కోట్లగా ఉంది. ఇప్పడు రూ. 5 కోట్లు పెరిగితే ఒక్కో ఫ్రాంచైజీ 100 కోట్ల మొత్తాన్ని కలిగి ఉంటుంది. ఇదిలా ఉంటే ఐపీఎల్‌పై సౌదీ కన్ను పడింది. ఐపీఎల్‌లో వాటా కొనుగోలు చేయాలని ఆ దేశం భావిస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్‌ వార్తా సంస్థ ఓ కథనం ప్రచురించింది.

ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సౌదీ అరేబియా, 5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లుగా వార్తలు

బీసీసీఐ నిర్వహిస్తున్న ఈ ఐపీఎల్‌ను 30 బిలియన్‌ డాలర్లు విలువైన ఓ హోల్డింగ్‌ కంపెనీగా మార్చాలని సౌదీ అరేబియా యువరాజు మహ్మద్‌బిన్‌ సల్మాన్‌ సలహాదారులు భారత ప్రభుత్వ ప్రతినిధులతో అన్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది.సెప్టెంబర్‌లో ఆయన భారత పర్యటనకు వచ్చినప్పుడు దీనికి సంబంధించిన ప్రతిపాదనలు వెళ్లినట్లు తెలిసింది.

ఈ హోల్డింగ్‌ కంపెనీలో యువరాజు 5 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.అయితే సౌదీ ప్రతిపాదనపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీనిపై బీసీసీఐ కూడా ఇంతవరకు స్పందించలేదు.కాగా సౌదీకి చెందిన ఆరామ్‌కో, సౌదీ టూరిజం డిపార్ట్‌మెంట్‌ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్న సంగతి విదితమే.