కొచ్చిలో జరుగుతున్న ఐపీఎల్ 2023 వేలంలో (IPL 2023 Auction) ముగ్గురు విదేశీ ఆటగాళ్లు భారీ ధరకు (IPL history's 3 most expensive buys) అమ్ముడుపోయారు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ రూ.18.50 కోట్ల భారీ ధరకు పంజాబ్ కింగ్స్ జట్టుకు అమ్ముడుపోయాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ధర పలికిన ఆటగాడిగా అతను గుర్తింపు సాధించాడు.తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్..రూ.17.50 కోట్లకు ముంబై ఇండియన్స్ కు అమ్ముడు పోయాడు.
మూడవ స్థానంలో బెన్ స్టోక్స్..రూ.16.25 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కు అమ్ముడుపోయాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు వేలం పాట మొదలైన అరగంటలోనే అమ్ముడు పోవడం ఆశ్చర్యకర పరిణామంగా చెప్పవచ్చు. వీరితో పాటు ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్.. రూ. 13.25 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అమ్ముడుపోయాడు.
ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఒక ఆటగాడిని ఇంత ధరకు కొనగడం ఇదే మొదటి సారి. అలాగే భారత ఆటగాడు మయాంక్ అగర్వాల్‌ను ఈ ఫ్రాంఛైజీ రూ.8.25 కోట్లకు కొన్నది. భారత ఆటగాళ్లలో అత్యధిక ధర దక్కించుకున్నఆటగాడిగా మయాంక్ నిలిచాడు.
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ రూ.7.25 కోట్లు పలికాడు. ఇతడిని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ కనీస ధరకే అమ్ముడుపోయాడు. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ అతడిని రూ.2 కోట్లకు దక్కించుకుంది.