Pink Ball Test Day-Night: Bangladesh Bowled out for 106 runs in 1st innings | Photo : BCCI

భారత్ మరియు బంగ్లాదేశ్ (India vs Bangladesh) మధ్య ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens) లో జగుతున్న చారిత్రాత్మక డే-నైట్ టెస్టు (Day-Night Test) మ్యాచ్‌లో ఆట మొదటి రోజే భారత్ తన ఆధిపత్యం ప్రదర్శించింది.   తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను 106 పరుగులకే కుప్ప కూల్చింది.  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్, బ్యాటింగ్ చేయటానికి మాత్రం గజగజ వణికిపోయింది. తొలిసారిగా పింక్ బాల్‌తో టీమిండియా బౌలర్లు బంగ్లా పులులను వేటాడారు. నిప్పుకణాల్లాంటి బంతులతో టీమిండియా బౌలర్లు చేసిన దాడికి బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ అంతా కేవలం 30.2 ఓవర్లకే చేతులెత్తేశారు. దీంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే ఆలౌట్ అయింది.

భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ (Ishant Sharma) 12 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు, ఇక ఉమేశ్ యాదవ్ 3 వికెట్లతో బంగ్లా టాప్ ఆర్డర్‌ను కూల్చాడు. విశేషమేమంటే ఉమేశ్ బౌలింగ్‌లో ఆ ముగ్గురు బ్యాట్స్‌మెన్ డకౌట్‌గా వెనుదిరిగారు. మహ్మద్ షమీ 2 వికెట్లు పడగొట్టాడు. ఇక బాగా ఆడుతాడు అనుకున్న బంగ్లా బ్యాట్స్‌మెన్ లిటన్ దాస్ 24 స్కోర్ వద్ద ఉన్నపుడు మహ్మద్ షమీ విసిరిన బౌన్సర్‌తో తలకు గాయమై రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.

బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ కనీసం టీ బ్రేక్ వరకు కూడా నిలబడలేకపోయారు. ఓపెనర్ షాద్ మాన్ చేసిన 29 పరుగులే హైఎస్ట్ స్కోర్, లింటన్ దాస్ 24, నయీమ్ హసన్ 19 పరుగులు చేయగా మిగతా వారు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. అందులో 4గురు బ్యాట్స్‌మెన్ డకౌట్ అయ్యారు.

టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం భారత్ స్కోర్ 10 ఓవర్లకు 28/1 గా ఉంది.  ఒపెనర్ మయాంక్ అగర్వాల్ 14 పరుగులకు ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ 12*, పుజారా 1* తో ఆడుతున్నారు.