Yashasvi Jaiswal (Photo Credits: Getty Images)

Lucknow, Febuary 15: ఉత్తరప్రదేశ్ యువ ఆటగాడు యశస్వీ జైశ్వాల్ (Yashasvi Jaiswal) గురుంచి ఈ మధ్య చాలామందికి తెలిసే ఉంటుంది. దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ 2020లో (Under-19 World Cup) 400 రన్స్‌ చేసి మ్యాన్ ఆఫ్ ది సీరిస్ ఆవార్డును గెలుచుకున్నాడు. అతను ఇంటికి రాగానే తల్లి కన్నీళ్లు పెట్టుకుందట.

యశస్వి ఇంటికి రాగానే తన బిడ్డను చూసి ‘ఇంత సన్నగైపోయావేందిరా’ (కిత్నా సుఖ్‌ గయా హై తూ!) (Kitna Sukh Gaya Hai Tu) అని ఒళ్లు తడిమి చూసుకుని కన్నీళ్లు కార్చింది. సాధారణంగా టీనేజ్‌ కుర్రాళ్లకు ఇలాంటి ఎమోషన్స్‌ నచ్చవు. తల్లిని కూడా దగ్గరకు రానివ్వరు. దీంతో ఈ కుర్రాడు కూడా ‘‘నువ్వూర్కోమ్మా’’ అన్నాడు.

‘‘అంత మాట అనేశావేంట్రా అబ్బాయ్‌! తల్లి ఎలా ఊరుకుంటుంది’’ అని చుట్టుపక్కల వాళ్లు అన్నారు. అప్పటికే వాళ్లంతా యశస్వీని చుట్టేసి, నువ్వు మామూలోడివి కాదురా, ఊరికే క్రికెట్‌ క్రికెట్‌ అంటుంటే.. చదువు అబ్బడం లేదనుకున్నాం కానీ.. క్రికెట్‌లో మంచి ర్యాంకే తెచ్చుకున్నావురా అని పొగిడేశారు.

తల్లికి ఆ మాటలేవీ చెవికి ఎక్కడం లేదు. ‘‘ముందు కాస్త తిను నాయనా’’ అని కొడుక్కి రొట్టెలు, శాకాహార పలహారం తెచ్చిపెట్టింది. తిన్నాడు. అప్పుడు కానీ ఆ తల్లి మనసు కుదుట పడలేదు. ‘నువ్వూర్కోమ్మా’ అని తల్లిని అన్న కొడుకు ఆ తర్వాత కాస్త ఫీల్‌ అయినట్లున్నాడు. ‘‘మా అమ్మకు ఎలా చెబితే అర్థమౌతుంది. ఆడాలంటే ఫిట్‌గా ఉండాలని’’ అన్నాడు.. అమ్మ కొంగుతో చేతులు తుడుచుకుంటూ. ఏదైమైనా ఓ బిడ్డ మనసు తల్లికి మాత్రమే తెలుస్తుంది.