Venkatesh Iyer in action (Photo Credits: @IPL/Twitter)

ఐపీఎల్‌–14 సీజన్‌ రెండో అంచెలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కోహ్లి సేనకు ఊహించని షాక్‌ ఇచ్చింది. బౌలింగ్‌లో వందలోపే కట్టడి చేసిన మోర్గాన్‌ బృందం బ్యాటింగ్‌లో 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని (Kolkata Knight Riders’ Victory) చేధించింది. దీంతో 20–20 ఓవర్ల ఆట కాస్తా 29 ఓవర్లలోనే ముగిసింది. సోమవారం మ్యాచ్ లో (Kolkata Knight Riders vs Royal Challengers Bangalore) ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 19 ఓవర్లలో 92 పరుగుల వద్ద ఆలౌటైంది.

ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ చేసిన 22 (20 బంతుల్లో 3 ఫోర్లు) పరుగులే వారి ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోర్‌. రసెల్‌ (3/9)) నిప్పులు చెరిగే స్పెల్‌తో... వరుణ్‌ చక్రవర్తి (3/13) తిప్పేసే మ్యాజిక్‌తో కోహ్లి సేన చేష్టలుడిగింది. తర్వాత కోల్‌కతా 10 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి 94 పరుగులు చేసి జయభేరి మోగించింది. ఓపెనర్లు శుబ్‌మన్‌ గిల్‌ (34 బంతుల్లో 48; 6 ఫోర్లు, 1 సిక్స్‌), వెంకటేశ్‌ అయ్యర్‌ (27 బంతుల్లో 41 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగారు. వరుణ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న బెంగళూరు శుభారంభం దక్కలేదు. తొమ్మిది ఓవర్లపాటు కనీసం ఫోర్‌ కూడా సాధించలేకపోయింది. రెండో ఓవర్‌లోనే కెప్టెన్‌ కోహ్లీ (5)ని ప్రసిధ్‌ ఎల్బీ చేశాడు.ఆ తర్వాత ఆర్‌సీబీ తరఫున తొలి మ్యాచ్‌ ఆడిన కేఎస్‌ భరత్‌తో కలిసి దేవ్‌దత్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ జోడీ కాసేపు కేకేఆర్‌ బౌలర్లను ఎదుర్కొని పవర్‌ప్లేలో 41 పరుగులు జత చేసింది. అయితే మూడు ఫోర్లతో జోరు మీదున్న దేవ్‌దత్‌ ర్యాంప్‌ షాట్‌ ఆడే ప్రయత్నంలో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో రెండో వికెట్‌కు 31 పరుగుల అత్యధిక భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత తొమ్మిదో ఓవర్‌లో రస్సెల్‌ రెండు వికెట్లతో జట్టుకు భారీ షాక్‌ ఇచ్చాడు.

ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న 5 గురు భారత కీలక ఆటగాళ్లు, ఈ సీజన్‌తో వారు శాశ్వత వీడ్కోలు పలకనున్నారని వార్తలు, ఎవరో ఓ సారి చూద్దామా

భరత్‌ తొలి బంతికి పుల్‌ షాట్‌ ఆడి డీప్‌ స్క్వేర్‌ లెగ్‌లో గిల్‌కు క్యాచ్‌ ఇవ్వగా డివిల్లీర్స్‌ (0)ను యార్కర్‌తో బౌల్డ్‌ చేశాడు. దీంతో 63 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఆదుకుంటాడనుకున్న మ్యాక్స్‌వెల్‌ (10) కూడా నిరాశపరిచాడు. భారీ షాట్లు ఆడే క్రమంలో స్పిన్నర్‌ వరుణ్‌ ఓవర్‌లో బౌల్డయ్యాడు. మరుసటి బంతికే హసరంగ (0) గోల్డెన్‌ డకౌట్‌ కావడంతో ఆర్‌సీబీ పీకల్లోతు కష్టాల్లో పడింది. సచిన్‌ బేబి (7)ని కూడా అతడే పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత హర్షల్‌ (12) రెండు ఫోర్లతో ఆకట్టుకున్నా ఉపయోగం లేకపోయింది. 19వ ఓవర్‌లో సిరాజ్‌ (8)ను రస్సెల్‌ అవుట్‌ చేయడంతో ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌ ముగిసింది.

స్కోరు వివరాలు

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (ఎల్బీ) (బి) ప్రసిధ్‌ కృష్ణ 5; పడిక్కల్‌ (సి) దినేశ్‌ కార్తీక్‌ (బి) ఫెర్గూసన్‌ 22; శ్రీకర్‌ భరత్‌ (సి) గిల్‌ (బి) రసెల్‌ 16; మ్యాక్స్‌వెల్‌ (బి) వరుణ్‌ 10; డివిలియర్స్‌ (బి) రసెల్‌ 0; సచిన్‌ బేబీ (సి) నితీశ్‌ (బి) వరుణ్‌ 7; హసరంగ (ఎల్బీ) (బి) వరుణ్‌ 0; జేమీసన్‌ (రనౌట్‌) 4; హర్షల్‌ పటేల్‌ (బి) ఫెర్గూసన్‌ 12; సిరాజ్‌ (సి) వరుణ్‌ (బి) రసెల్‌ 8; చహల్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్‌) 92. వికెట్ల పతనం: 1–10, 2–41, 3–51, 4–52, 5–63, 6–63, 7–66, 8–76, 9–83, 10–92. బౌలింగ్‌: వరుణ్‌ చక్రవర్తి 4–0–13–3, ప్రసిధ్‌ కృష్ణ 4–0–24–1, ఫెర్గూసన్‌ 4–0–24–2, నరైన్‌ 4–0–20–0, రసెల్‌ 3–0– 9–3.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: గిల్‌ (సి) సిరాజ్‌ (బి) చహల్‌ 48; వెంకటేశ్‌ (నాటౌట్‌) 41; రసెల్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (10 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 94. వికెట్‌ పతనం: 1–82. బౌలింగ్‌: సిరాజ్‌ 2–0–12–0, జేమీసన్‌ 2–0–26–0, హసరంగ 2–0–20–0, చహల్‌ 2–0–23–1, హర్షల్‌ పటేల్‌ 2–0–13–0.