KKR vs SRH Stat Highlights IPL 2020: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మళ్లీ ఓడింది, ఐపీఎల్‌–2020లో బోణీ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌, 70 పరుగులతో చెలరేగిన శుబ్‌మన్‌ గిల్‌
KKR vs SRH (Photo Credits: Twitter/IPL)

ఐపీఎల్‌–2020లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బోణీ చేసింది. శనివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో కోల్‌కతా 7 వికెట్లతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై (KKR vs SRH Stat Highlights IPL 2020) ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) మళ్లీ ఓడింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రైజర్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే (38 బంతుల్లో 51; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ నమోదు చేయగా, డేవిడ్‌ వార్నర్‌ (30 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్‌), వృద్ధిమాన్‌ సాహా (31 బంతుల్లో 30; 1 ఫోర్, 1 సిక్స్‌) మోస్తరుగా ఆడారు.

అనంతరం కోల్‌కతా (Kolkata Knight Riders) 18 ఓవర్లలో 3 వికెట్లకు 145 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శుబ్‌మన్‌ గిల్‌ (62 బంతుల్లో 70 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), మోర్గాన్‌ (29 బంతుల్లో 42 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కలిసి జట్టును గెలిపించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 70 బంతుల్లో 92 పరుగులు జోడించారు.

కోల్‌కతా పదునైన బౌలింగ్‌ దెబ్బకు సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌‌లో వార్నర్‌తో పాటు ఒక్క బ్యాట్స్‌మన్‌ కూడా కావాల్సినంత దూకుడును ప్రదర్శించలేదు. నరైన్‌ ఓవర్లో వార్నర్‌ ఒక సిక్స్, ఫోర్‌ కొట్టినా... తర్వాతి ఓవర్లోనే కమిన్స్‌ చక్కటి బంతితో బెయిర్‌స్టో (5)ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. పుట్టినరోజునాడు బెయిర్‌స్టోకు మైదానంలో కలిసి రాలేదు. ఆ తర్వాత కూడా కేకేఆర్‌ బౌలర్లు ప్రత్యర్థిపై బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడిని కొనసాగించారు. వరుణ్‌ వేసిన తొలి బంతినే అర్థం చేసుకోవడంలో తడబడి వార్నర్‌ రిటర్న్‌ క్యాచ్‌ ఇవ్వడంతో రైజర్స్‌ కీలక వికెట్‌ కోల్పోయింది.

రెండోసారి చతికిల బడ్డ సీఎస్‌కే, మరో విజయాన్ని నమోదు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌, బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించిన పృథ్వీ షా

నాలుగో స్థానంలో వచ్చిన సాహా సింగిల్స్‌కే పరిమితం కాగా, మరో ఎండ్‌లో మనీశ్‌ పాండే అప్పుడప్పుడు ఒక్కో బౌండరీతో స్కోరు బోర్డును నడిపించాడు. 35 బంతుల్లో పాండే అర్ధసెంచరీ పూర్తయింది. రసెల్‌ బౌలింగ్‌లో పాండే రిటర్న్‌ క్యాచ్‌ ఇవ్వగా, కొద్ది సేపటికే సాహా రనౌటయ్యాడు. ఐపీఎల్‌లో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఒక జట్టు ఇంతకంటే తక్కువ స్కోరు నమోదు చేయడం గతంలో రెండుసార్లు మాత్రమే జరిగింది. గాయంతో ఐపీఎల్‌కు దూరమైన మిచెల్‌ మార్ష్ స్థానంలో నబీని, వెన్నునొప్పితో బాధపడుతున్న విజయ్‌ శంకర్‌ స్థానంలో సాహాను తుది జట్టులోకి తీసుకున్న సన్‌రైజర్స్‌... పేసర్‌ సందీప్‌ శర్మకు బదులుగా ఖలీల్‌కు అవకాశం ఇచ్చింది.

143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగన కేకేఆర్.. ఖలీల్‌ వేసిన రెండో ఓవర్లోనే నరైన్‌ (0) వెనుదిరగడంతో తొలి వికెట్‌ కోల్పోయింది. మూడో స్థానంలో వచ్చిన నితీశ్‌ రాణా (13 బంతుల్లో 26; 6 ఫోర్లు) ఉన్నంత సేపు ధాటిగా ఆడాడు. తొమ్మిది బంతుల వ్యవధిలో అతను ఐదు బౌండరీలు బాదాడు. ఇందులో ఖలీల్‌ బౌలింగ్‌లో వరుస బంతుల్లో కొట్టిన మూడు ఫోర్లు ఉన్నాయి. అయితే నటరాజన్‌ అతడిని వెనక్కి పంపగా, కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (0)ను రషీద్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కార్తీక్‌ రివ్యూ చేసినా లాభం లేకపోయింది.

మరోవైపు గిల్‌ మాత్రం చూడ చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఆడుతూ తన బ్యాటింగ్‌ పదును చూపించాడు. 42 బంతుల్లో గిల్‌ అర్ధ సెంచరీ పూర్తయింది. మరోవైపు మోర్గాన్‌ నుంచి అతనికి చక్కని సహకారం లభించింది. లక్ష్యం కూడా చిన్నది కావడంతో వీర్దిదరికి ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. నటరాజన్‌ వేసిన 18వ ఓవర్‌ చివరి రెండు బంతులకు మోర్గాన్‌ సిక్స్, ఫోర్‌ బాదడంతో మ్యాచ్‌ కోల్‌కతా వశమైంది.

స్కోరు వివరాలు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి అండ్‌ బి) వరుణ్‌ 36; బెయిర్‌స్టో (బి) కమిన్స్‌ 5; పాండే (సి అండ్‌ బి) రసెల్‌ 51; సాహా (రనౌట్‌) 30; నబీ (నాటౌట్‌) 11; అభిషేక్‌ శర్మ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 142.

వికెట్ల పతనం: 1–24; 2–59; 3–121; 4–138.

బౌలింగ్‌: నరైన్‌ 4–0–31–0; కమిన్స్‌ 4–0–19–1; శివమ్‌ మావి 2–0–15–0; కుల్దీప్‌ 2–0–15–0; వరుణ్‌ 4–0–25–1; నాగర్‌కోటి 2–0–17–0; రసెల్‌ 2–0–16–1.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: గిల్‌ (నాటౌట్‌) 70; నరైన్‌ (సి) వార్నర్‌ (బి) ఖలీల్‌ 0; రాణా (సి) సాహా (బి) నటరాజన్‌ 26; కార్తీక్‌ (ఎల్బీ) (బి) రషీద్‌ ఖాన్‌ 0; మోర్గాన్‌ (నాటౌట్‌) 42; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (18 ఓవర్లలో 3 వికెట్లకు) 145.

వికెట్ల పతనం: 1–6; 2–43; 3–53.

బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3–0–29–0; ఖలీల్‌ 3–0–28–1; నటరాజన్‌ 3–0–27–1; రషీద్‌ ఖాన్‌ 4–0–25–1; నబీ 4–0–23–0; అభిషేక్‌ శర్మ 1–0–11–0.