Trent Boult and Ishan Kishan (Photo Credits: Twitter/@mipaltan)

Chennai, April 14: ముంబై గెలుస్తుందని పోరాడుతున్న ఆ జట్టు సభ్యులకు కూడా నమ్మకం లేదు, కోల్‌కతా ఓడిపోతుందని బ్యాటింగ్ చేస్తున్న బ్యాట్స్ మెన్ కి భయం లేదు. కానీ అనూహ్యంగా చివరకు విజయం ముంబైని వరించగా, కోల్‌కతా చేజేతులా గెలిచే మ్యాచ్ ఓడిపోయింది. మంగళవారం చెన్నై వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మరియు ముంబై ఇండియన్స్ (ఎంఐ) మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ముంబై 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా అనుకున్న విధంగానే హార్డ్ హిట్టర్లు ఉన్న ముంబైని తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. సూర్యకుమార్ యాదవ్ 56, రోహిత్ శర్మ 43 మినహా ముంబై బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. డెత్ ఓవర్లలో కూడా కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌట్ అయింది.

153 పరుగుల లక్ష్యంతో రన్ చేజ్ ప్రారంభించిన కేకేఆర్‌కు ఓపెనర్లు నితీష్ రాణా 57, శుభమన్ గిల్ 33 పరుగులు చేసి మంచి శుభారంభాన్నిచ్చారు. అయితే రాహుల్ చాహార్ మాయాజాలంతో కేకేఆర్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. రాహుల్ చాహార్ 4 ఓవర్లలో తొలి 4 వికెట్లు పడగొట్టి 27 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అప్పటికి కేకేఆర్ స్కోర్ 15 ఓవర్లకు 122, విజయానికి ఇంకా 30 బంతుల్లో 31 పరుగులు మాత్రమే కావాలి. అంతేకాకుండా షకీబ్, దినేష్ కార్తీక్, ఆండ్రూ రస్సెల్ లాంటి బ్యాట్స్‌మెన్ ఉన్నారు. వారు ఒక్క ఓవర్ ధాటిగా ఆడినా సునాయాసంగా మ్యాచ్ కేకేఆర్ వైపే, ఒక్కో పరుగు తీసుకున్నా వారి వైపే కానీ, వెంటనే షకీబ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఆండ్రూ రస్సెల్ 2 సార్లు సునాయాసమైన క్యాచులు ఇచ్చాడు అయినా ముంబై ఫీల్డర్లు వాటిని వదిలేశారు. ఇంక ముంబైకి దిక్కు ఎక్కడా అనుకుంటున్న సమయంలో కూడా కేకేఆర్ ఆడలేకపోయింది. డెత్ ఓవర్లలో ముంబై బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 20 ఓవర్లకు కేకేఆర్ 7 వికెట్లు కోల్పోయి 142 పరుగులు మాత్రమే చేసింది. క్రీజులో హిట్టింగ్ బ్యాట్స్‌మెన్ ఉండికూడా కేకేఆర్ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడటం ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది.

ఇక కేకేఆర్ ఫ్రాంచైజీ యజమాని షారుఖ్ ఖాన్ కూడా తన జట్టు ఓటమి నిరాశ కలిగించిందని చెప్పుకొచ్చారు. కేకేఆర్ అభిమానులకు క్షమాపణ చెబుతున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.

ఇక ఐపీఎల్ సెంటిమెంట్‌ను ముంబై ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. ముంబై ఐపీఎల్ విజేతగా నిలిచిన ప్రతీసారి లీగ్ దశలో తొలి మ్యాచ్ ఓడిపోయి, రెండో మ్యాచ్ గెలిచింది. ఇప్పుడు ప్రస్తుత 14వ ఎడిషన్లో కూడా ముంబై అదే ట్రెండ్ కంటిన్యూ చేయడం పట్ల ఇప్పట్కే 5 సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఈసారి కూడా విజేతగా నిలుస్తుందా అని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చూడాలి వారి అంచనాలు నిజమవుతాయో లేదో!

ఇదిలా ఉంటే, ఈరోజు బుధవారం హైదరాబాద్ (SRH) మరియు బెంగళూరు (RCB) మధ్య చెన్నై వేదికగా మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 7:30 నుంచి మ్యాచ్ ప్రారంభం.