KXIP vs CSK Stat Highlights IPL 2020: హ్యాట్రిక్ పరాజయాలకు ధోనీ సేన పుల్‌స్టాప్, 10 వికెట్ల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై ఘనవిజయం, నాలుగో ఓటమిని చవిచూసిన పంజాబ్
Shane Watson And Faf du Plessis (Photo Credits: Twitter)

సమిష్టిగా ఆడిన చెన్నై హ్యాట్రిక్ పరాజయాలకు పుల్‌స్టాప్ పెట్టింది. నిన్న పంజాబ్ కింగ్స్‌ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్ లో (KXIP vs CSK Stat Highlights IPL 2020) 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. లీగ్‌లో ఇప్పటిదాకా 5 మ్యాచ్‌లాడిన పంజాబ్‌కు ఇది నాలుగో ఓటమి కాగా ధోనీ సేన టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది.

పంజాబ్‌ (Kings XI Punjab) టాస్‌ గెలవగానే మరో ఆలోచన లేకుండా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ఓపెనర్లు రాహుల్‌, మయాంక్‌ (26) ఆచితూచి ఆడడంతో పవర్‌ప్లేలో జట్టు 46 పరుగులు సాధించింది. ఈ దశలో స్పిన్నర్‌ చావ్లా తన తొలి ఓవర్‌లోనే మయాంక్‌ వికెట్‌ను తీశాడు. దీంతో మొదటి వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత మన్‌దీప్ (29) ఉన్న కాసేపు వేగంగా ఆడాడు. 11వ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదినా మరుసటి ఓవర్‌లోనే జడేజాకు చిక్కాడు. అయితే అప్పటిదాకా మెరుపులు లేని పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో నికోలస్‌ పూరన్‌ జోష్‌ తెచ్చాడు. అయితే 9 పరుగుల రన్‌రేట్‌కు చేరిన ఈ దశలో 18వ ఓవర్‌ వేసిన శార్దుల్‌ వరుస బంతుల్లో పూరన్, రాహుల్‌లను ఔట్‌ చేయడంతో డెత్‌ ఓవర్లలో రావల్సినన్ని పరుగులు రాలేదు. మొత్తం 20 ఓవర్లు ఆడిన పంజాబ్ 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. చెన్నైకి 179 పరుగు లక్ష్యాన్ని నిర్దేశించింది.

రాజస్తాన్‌ రాయల్స్‌పై కోహ్లీ సేన ఘన విజయం, చాన్నాళ్ల తరువాత ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ, ముచ్చటగా మూడో విజయాన్ని నమోదు చేసిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు

ప్రత్యర్థి తమ ముందు గట్టి లక్ష్యాన్నే నిర్దేశించినా... ఓపెనర్లు వాట్సన్‌ (53 బంతుల్లో 83 నాటౌట్‌; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), డుప్లెసిస్‌ (53 బంతుల్లో 87 నాటౌట్‌; 11 ఫోర్లు, 1 సిక్స్‌) వేసిన పరుగుల బాటతో సూపర్‌కింగ్స్‌ (Chennai Super Kings) విజయబావుటా ఎగరేసింది. చెన్నై సూపర్‌కింగ్స్‌ 17.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండానే 181 పరుగులు చేసి గెలిచింది. వాట్సన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. కింగ్స్‌ తుది జట్టులో కరుణ్, గౌతమ్, నీషమ్‌లను పక్కనబెట్టి మన్‌దీప్, హర్‌ప్రీత్‌ బ్రార్, జోర్డాన్‌లను తీసుకోగా... చెన్నై మార్పులేకుండా గత మ్యాచ్‌ ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది. ఐపీఎల్‌ చరిత్రలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు 10 వికెట్ల విజయాన్ని అందుకోవడం ఇది రెండోసారి. 2013లోనూ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పైనే చెన్నై జట్టు తొలి 10 వికెట్ల విజయాన్ని సాధించడం విశేషం. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో 12 సార్లు 10 వికెట్ల తేడాతో విజయాలు నమోదయ్యాయి.

ఎంఎస్‌ ధోని మరో రికార్డు

చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ ధోని మరో రికార్డు సాధించాడు. ఐపీఎల్‌ చరిత్రలో వంద క్యాచ్‌లను అందుకున్న రెండో వికెట్‌ కీపర్‌గా నిలిచాడు. కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని ఈ మార్కును చేరాడు. కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఇచ్చిన క్యాచ్‌ను డైవ్‌ కొట్టి పట్టడంతో ధోని వంద క్యాచ్‌ల ఫీట్‌ను సాధించాడు. ఫలితంగా ఈ లీగ్‌లో అత్యధిక వికెట్‌ కీపర్‌ క్యాచ్‌లు పట్టిన రెండో ఆటగాడిగా గుర్తింపు పొందాడు.

ఇక్కడ కేకేఆర్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ తొలి వికెట్‌ కీపర్‌ కాగా, ఆ తర్వాత ధోని దాన్ని సాధించాడు. 2017లో గుజరాత్‌ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కార్తీక్‌ వంద వికెట్‌ కీపర్‌ క్యాచ్‌ల ఘనతను సాధించాడు. ఇక అత్యధిక ఔట్లలో భాగమైన వికెట్‌ కీపర్లలో మాత్రం ధోని తొలి స్థానంలో ఉన్నాడు. ధోని 139 ఔట్లలో భాగమయ్యాడు. క్యాచ్‌లు, స్టంపౌట్‌లతో కలుపుకుని దీన్ని సాధించాడు. ఈ జాబితాలో కార్తీక్‌ 133 ఔట్లలో భాగమై రెండో స్థానంలో ఉన్నాడు.

స్కోరు వివరాలు

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌: లోకేశ్‌ రాహుల్‌ (సి) ధోని (బి) శార్దుల్‌ 63; మయాంక్‌ (సి) కరన్‌ (బి) పీయూశ్‌ 26; మన్‌దీప్‌ (సి) రాయుడు (బి) జడేజా 27; పూరన్‌ (సి) జడేజా (బి) శార్దుల్‌ 33; మ్యాక్స్‌వెల్‌ (నాటౌట్‌) 11; సర్ఫరాజ్‌ (నాటౌట్‌) 14; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 178.

వికెట్ల పతనం: 1–61, 2–94, 3–152, 4–152.

బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 3–0–17–0, స్యామ్‌ కరన్‌ 3–0–31–0, శార్దుల్‌ 4–0–39–2, బ్రేవో 4–0–38–0, జడేజా 4–0–30–1, పీయూశ్‌ 2–0–22–1.

చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: వాట్సన్‌ (నాటౌట్‌) 83; డుప్లెసిస్‌ (నాటౌట్‌) 87; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (17.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 181.

బౌలింగ్‌: కాట్రెల్‌ 3–0–30–0, షమీ 3.4–0–35–0, హర్‌ప్రీత్‌ 4–0–41–0, జోర్డాన్‌ 3–0–42–0, రవి బిష్ణోయ్‌ 4–0–33–0.