Dinesh Karthik of Kolkata Knight Riders (Photo Credits: IANS)

వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తక్కువ లక్ష్యాన్ని (KXIP vs KKR Stat Highlights) కాపాడుకుంటూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సత్తా చాటింది. శనివారం పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో (KXIP vs KKR Stat Highlights Dream11 IPL 2020) కోల్‌కతా 2 పరుగులతో విజయం సాధించింది.కాగా కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చివరి వరకు విజయం ఎవరిని వరిస్తుందో అంచనా వేయలేక అభిమానులు అయోమయంలో పడిపోయారు. ఎట్టకేలకు విజయం కోల్‌కతా పక్షాన నిలిచింది. రెండు పరుగుల తేడాతో విజయం సాధించిన కోల్‌కతా శిబిరంలో సంబరాలు మొదలు కాగా, పంజాబ్ విజయానికి అంగుళం దూరంలో నిలిచిపోయి పరాజయం పాలైంది.

కోల్‌కతా నిర్దేశించిన 165 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ 115 పరుగుల వరకు ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. వికెట్లు తీసేందుకు కోల్‌కతా బౌలర్లు చెమటోడ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. క్రీజులో పాతుకుపోయిన కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లు చెలరేగిపోతుంటే బౌలర్లు చేష్టలుడిగి చూస్తుండిపోయారు.ఇక రాహుల్ బాదుడు చూసి మ్యాచ్ ఏకపక్షమనే అనుకున్నారు.

115 పరుగుల వద్ద మయాంక్ (39 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 56) అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ కూడా వచ్చీ రాగానే బ్యాట్ ఝళిపించడంతో పంజాబ్ విజయం ఖాయమని తేలిపోయింది. కోల్‌కతా శిబిరంలో నిస్తేజం అలముకుంది. సరిగ్గా అదే సమయంలో 16 పరుగులు చేసిన పూరన్ అవుటయ్యాడు. మరో ఐదు పరుగులకే సిమ్రన్ సింగ్ (4) కూడా పెవిలియన్ బాటపట్టడంతో కోల్‌కతా శిబిరంలో ఆశలు రేకెత్తాయి. అప్పటికి 18.4 ఓవర్లలో పంజాబ్ స్కోరు 149/3.

కోహ్లీ దూకుడుతో నాలుగో విజయాన్ని నమోదు చేసిన రాయల్‌ చాలెంజర్స్‌, వరుసగా మూడో మ్యాచులో ఓటమిపాలైన చెన్నై సూపర్ కింగ్స్

విజయానికి చేరువగా రావడం, చేతిలో కావాల్సినన్ని వికెట్లు ఉండడం, బంతులకు, చేయాల్సిన పరుగులకు పెద్దగా తేడా లేకపోవడం, క్రీజులో రాహుల్ ఉండడంతో విజయం ఇంకా పంజాబ్ గట్టుపైనే ఉంది. అయితే, 151 పరుగుల వద్ద రాహుల్ (58 బంతుల్లో 6 ఫోర్లుతో 74) అవుటయ్యాడు. ఇక చివరి ఓవర్‌లో పంజాబ్ విజయానికి 14 పరుగులు అవసరం కాగా, క్రీజులో అనుభవజ్ఞుడైన మ్యాక్స్‌వెల్ ఉండడంతో ఏమూలో ఆశలు ఉన్నాయి.

20వ ఓవర్ తొలి బంతికి మ్యాక్సీ రెండు పరుగులు తీశాడు. రెండో బంతి డాట్ బాల్ కాగా, మూడో బంతికి మ్యాక్స్‌వెల్ ఫోర్ బాదాడు. దీంతో మళ్లీ ఆశలు చిగురించాయి. నాలుగో బంతికి ఒక్క పరుగు రాగా, ఐదో బంతికి మన్‌దీప్ అవుటయ్యాడు. ఇక చివరి బంతికి ఏడు పరుగులు అవసరం కాగా, మ్యాక్స్‌వెల్ సిక్స్ కొడితే కనుక టై అయి సూపర్ ఓవర్‌కు దారి తీస్తుందని భావించారు. నరైన్ వేసిన చివరి బంతిని మ్యాక్స్‌వెల్ బలంగా బాదాడు. అయితే, బంతి బౌండరీకి ఆవైపు కాకుండా ఈవైపు తగలడంతో నాలుగు పరుగులే వచ్చాయి. దీంతో రెండు పరుగుల తేడాతో పంజాబ్ ఓటమి పాలైంది. కోల్‌కతా శిబిరంలో పండుగ వాతావరణం నెలకొనగా, ఊహించని ఓటమిని ఎదుర్కొన్న పంజాబ్ శిబిరంలో నిరాశ అలముకుంది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా శుభ్‌మన్ గిల్ 57 (47 బంతుల్లో 5 ఫోర్లతో), కెప్టెన్ దినేశ్ కార్తీక్ 58 (29 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో) పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించిన దినేశ్ కార్తీక్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

స్కోరు వివరాలు

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ త్రిపాఠి (బి) షమీ 4; గిల్‌ (రనౌట్‌) 57; రాణా (రనౌట్‌) 2; మోర్గాన్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) బిష్ణోయ్‌ 24; కార్తీక్‌ (రనౌట్‌) 58; రసెల్‌ (సి) ప్రభ్‌ సిమ్రన్‌ (బి) అర్‌‡్షదీప్‌ 5; కమిన్స్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 164.

వికెట్ల పతనం: 1–12, 2–14, 3–63, 4–145, 5–150, 6–164.

బౌలింగ్‌: షమీ 4–0–30–1, అర్‌‡్షదీప్‌ 4–1–25–1, జోర్డాన్‌ 4–0–37–0, ముజీబ్‌ 4–0–44–0, బిష్ణోయ్‌ 4–0–25–1.

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (బి) ప్రసిధ్‌ 74; మయాంక్‌ (సి) గిల్‌ (బి) ప్రసి«ధ్‌ 56; పూరన్‌ (బి) నరైన్‌ 16; ప్రభ్‌ సిమ్రన్‌ (సి) రాణా (బి) ప్రసిధ్‌ 4; మ్యాక్స్‌వెల్‌ (నాటౌట్‌) 10; మన్‌దీప్‌ (సి) (సబ్‌) గ్రీన్‌ (బి) నరైన్‌ 0; జోర్డాన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 162.

వికెట్ల పతనం: 1–115, 2–144, 3–149, 4–151, 5–158.

బౌలింగ్‌: కమిన్స్‌ 4–0–29–0, ప్రసి«ధ్‌ 4–0–29–3, కమలేశ్‌ 3–0–40–0, వరుణ్‌ 4–0–27–0, నరైన్‌ 4–0–28–2, రాణా 1–0–7–0.