Chris Gayle And Ben Stokes (Photo Credits: Twitter)

వరుస విజయాలతో దూసుకెళుతున్న కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ దూకుడుకు ఎట్టకేలకు అడ్డుకట్ట పడింది. ప్లేఆప్ చోటు కోసం క్రితం మ్యాచ్‌లో ముంబైని మట్టికరిపించిన రాజస్థాన్‌ రాయల్స్‌ (KXIP vs RR Stat Highlights) మరో అద్భుత ప్రదర్శన చోటు చేసుకుంది.

మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’బెన్‌ స్టోక్స్‌ (26 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సంజూ సామ్సన్‌ (25 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించడంతో... శుక్రవారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై రాజస్తాన్‌ రాయల్స్‌ (KXIP vs RR Stat Highlights IPL 2020) జట్టు ఏడు వికెట్లతో గెలుపొందింది. దీంతో 12 పాయింట్లతో ఆర్‌ఆర్‌ (Rajasthan Royals) ఐదో స్థానానికి చేరింది. అటు పంజాబ్‌ (Kings XI Punjab) కూడా అవే పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నా ఆ జట్టు ముందుకెళ్లడం ఇతర ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 185 పరుగులు చేసింది. ఆరంభంలోనే ఆర్చర్‌ బౌలింగ్‌లో స్టోక్స్‌ చక్కటి క్యాచ్‌కు ఓపెనర్‌ మన్‌దీప్‌ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత రాహుల్‌కు గేల్‌ జతకూడటంతో రాయల్స్‌ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పరాగ్, ఉతప్ప సమన్వయలేమితో ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న గేల్‌... కార్తీక్‌ త్యాగి ఓవర్‌లో వరుసగా 4, 6, 4 రెచ్చిపోయాడు. ఆరోన్‌ బౌలింగ్‌లో రాహుల్‌ కూడా 6, 4 బాదడంతో పవర్‌ ప్లేలో పంజాబ్‌ 53/1తో నిలిచింది.

పోతూ పోతూ కోల్‌కతా ఆశలపై నీళ్లు చల్లిన చెన్నై, 6 వికెట్ల తేడాతో నైట్ రైడర్స్‌పై విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్, బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించిన రుతురాజ్‌ గైక్వాడ్‌, రవీంద్ర జడేజా

క్రిస్‌ గేల్‌ (63 బంతుల్లో 99; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) ఒక్క పరుగు తేడాతో సెంచరీ కోల్పోయాడు. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (41 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), పూరన్‌ (10 బంతుల్లో 22; 3 సిక్సర్లు) రాణించారు. ఆర్చర్, స్టోక్స్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. చివరి ఐదు ఓవర్లలో పూరన్, గేల్‌ ఆరు సిక్సర్లతో అలరించారు. ఆరోన్‌ ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లు, త్యాగి బౌలింగ్‌లో మరొకటి కొట్టి పూరన్‌ ప్రమాదకరంగా కనిపించాడు. బౌండరీ వద్ద తేవటియా క్యాచ్‌కు అతను ఔటైనా... గేల్‌ 4, 6తో 14 పరుగులు రాబట్టాడు. తర్వాత మరో రెండు సిక్సర్లు కొట్టి సెంచరీకి సమీపించిన గేల్‌ను ఆర్చర్‌ అద్భుత యార్కర్‌తో నిలువరించాడు. చివరి 30 బంతుల్లో పంజాబ్‌ 62 పరుగులు రాబట్టింది.

అనంతరం 186 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్‌ 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (20 బంతుల్లో 31 నాటౌట్‌; 5 ఫోర్లు), బట్లర్‌ (11 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్సర్లు) నాలుగో వికెట్‌కు అజేయంగా 19 బంతుల్లో 41 పరుగుల్ని జోడించి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ వికెట్‌పై 186 పరుగుల ఛేదన సవాల్‌తో కూడుకున్నదే అయినా రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ కలిసికట్టుగా కదం తొక్కారు.

ముందుగా డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ స్టోక్స్‌ తొలి ఓవర్‌ నుంచే బౌండరీలతో దుమ్ము రేపాడు. నాలుగో ఓవర్‌లో వరుసగా 4,6,6తో 16 రన్స్‌ పిండుకున్నాడు. ఇక జోర్డాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌ తొలి బంతిని భారీ సిక్సర్‌గా మలిచి 24 బంతుల్లోనే అర్ధసెంచరీ కూడా పూర్తి చేశాడు. కానీ ఆ ఓవర్‌ మూడో బంతికే హూడాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే స్టోక్స్‌ ధాటికి పవర్‌ప్లేలో రాజస్థాన్‌ 11 పరుగుల రన్‌రేట్‌తో 66/1 స్కోరుతో మంచి స్థితిలో నిలిచింది.

ఆ తర్వాత బాధ్యతను సంజూ శాంసన్‌ తీసుకుని ఎదురుదాడికి దిగగా 10 ఓవర్లలోనే జట్టు 103 పరుగులు సాధించింది. అటు ఊతప్ప (30) అద్భుత సిక్సర్‌తో ఊపు మీద కనిపించినా ఎం.అశ్విన్‌ అతడిని పెవిలియన్‌కు చేర్చాడు. 13వ ఓవర్‌లో శాంసన్‌ వరుసగా 6,4 సాధించి స్కోరులో వేగం తగ్గకుండా చూశాడు. కానీ దురదృష్టవశాత్తు 15వ ఓవర్‌లో రనౌట్‌ కావడంతో అతడి పోరాటం ముగిసింది. ఆ ఓవర్‌లో బిష్ణోయ్‌ కేవలం రెండు పరుగులే ఇచ్చాడు. అయినా చివరి 5 ఓవర్లలో 40 పరుగులే రావాల్సి ఉండగా ఆర్‌ఆర్‌ ఇబ్బంది లేకుండా ఆడింది. షమి వేసిన 17వ ఓవర్‌లో కెప్టెన్‌ స్మిత్‌ మూడు ఫోర్లు, బట్లర్‌ ఫోర్‌తో 19 రన్స్‌ రావడంతో రాజస్థాన్‌ విజయం ఖాయమైంది.

స్కోరు వివరాలు

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌: కేఎల్‌ రాహుల్‌ (సి) రాహుల్‌ తేవటియా (బి) స్టోక్స్‌ 46; మన్‌దీప్‌ సింగ్‌ (సి) స్టోక్స్‌ (బి) ఆర్చర్‌ 0; క్రిస్‌ గేల్‌ (బి) ఆర్చర్‌ 99; నికోలస్‌ పూరన్‌ (సి) రాహుల్‌ తేవటియా (బి) స్టోక్స్‌ 22; మ్యాక్స్‌వెల్‌ (నాటౌట్‌) 6; దీపక్‌ హుడా (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 185.

వికెట్ల పతనం: 1–1, 2–121, 3–162, 4–184.

బౌలింగ్‌: ఆర్చర్‌ 4–0–26–2; వరుణ్‌ ఆరోన్‌ 4–0–47–0; కార్తీక్‌ త్యాగి 4–0–47–0; శ్రేయస్‌ గోపాల్‌ 1–0–10–0; స్టోక్స్‌ 4–0–32–2; రాహుల్‌ తేవటియా 3–0–22–0.

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: రాబిన్‌ ఉతప్ప (సి) పూరన్‌ (బి) మురుగన్‌ అశ్విన్‌ 30; స్టోక్స్‌ (సి) దీపక్‌ హుడా (బి) జోర్డాన్‌ 50; సామ్సన్‌ (రనౌట్‌) 48; స్మిత్‌ (నాటౌట్‌) 31; బట్లర్‌ (నాటౌట్‌) 22; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (17.3 ఓవర్లలో మూడు వికెట్లకు) 186.

వికెట్ల పతనం: 1–60, 2–111, 3–145.

బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ సింగ్‌ 3–0–34–0, షమీ 3–0–36–0, మురుగన్‌ అశ్విన్‌ 4–0–43–1, క్రిస్‌ జోర్డాన్‌ 3.3–0–44–1, రవి బిష్ణోయ్‌ 4–0–27–0.