Manish Pandey and Vijay Shankar. (Photo Credits: Twitter|@SunRisers)

RR vs SRH: ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఎట్టకేలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దుబాయ్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు అలవోకంగా గెలిచేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 154 పరుగులు చేసింది. రాజస్థాన్ జట్టులో సంజూ శాంసన్ 36 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 3 వికెట్లు పడగొట్టగా, రషీద్ ఖాన్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ 1 వికెట్ పడగొట్టాడు. విజయ్ శంకర్ కూడా ఒక వికెట్ తీశాడు, ఒకరు రనౌట్.

ఇక 155 పరుగుల విజయ లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టుకు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఒక ఫోర్ కొట్టిన డేవిడ్ వార్నర్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు, కొద్దిసేపటికే మరో ఓపెనర్ జానీ బెయిర్ స్టో కూడా 10 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ రెండు వికెట్లను జోఫ్రా ఆర్చర్ పడగొట్టాడు.

ఆ తరువాత వచ్చిన మనీశ్ పాండే - విజయ్ శంకర్ జోడి సూపర్ హిట్ అయింది. హాఫ్ సెంచరీలు సాధించిన వీరిద్దరూ, చివరి వరకు నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చారు. మనీశ్ పాండే 47 బంతుల్లో 8 సిక్సర్లు, 4 ఫోర్లతో దుమ్మురేపి 83 పరుగులు చేయగా, 51 బంతుల్లో 52 పరుగులు చేసిన విజయ్ శంకర్ అద్భుత సహకారాన్ని అందించాడు. వీరిద్దరూ కలిసి 140 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.  చివరకు 18.1 ఓవర్లలోనే హైదరాబాద్ లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ విజయంతో హైదరాబాద్ ప్లేఆఫ్ ఆశలు ఇంకా సజీవంగా ఉంచుకోగా, అటు రాజస్థాన్ ప్లేఆఫ్ అవకాశాలు మాత్రం గల్లంతయ్యాయి. కాగా, హైదరాబాద్ ఇకపై ఆడే అన్ని మ్యాచ్‌లు ఎంతో కీలకం కానున్నాయి.

స్కోర్ల వివరాలు: రాజస్థాన్ రాయల్స్  20 ఓవర్లలో 154/6; సన్ రైజర్స్ హైదరాబాద్ 18.1 ఓవర్లలో 156/2; ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్-  మనీశ్ పాండే.