అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ లో బెంగళూరు జట్టు కాలర్ ఎగరేసింది. ఆల్ రౌండ్ ప్రతిభతో ప్రత్యర్థి జట్టును చిత్తుగా ఓడించింది. కేకేఆర్ జట్టుపై ఆర్సీబీ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా జట్టు బెంగళూరు బౌలర్ల ధాటిని తట్టుకోలేకపోయింది. వెంటవెంటనే వికెట్లు కోల్పోవడమే కాకుండా పరుగులు చేయటానికే కష్టపడింది. ఐపీఎల్ టోర్నమెంట్లో ఒక ఇన్నింగ్స్ లో 4 ఓవర్లు మేయిడిన్ అయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి కేవలం 84 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్‌కతా టీం నుంచి కెప్టెన్ మోర్గాన్ చేసిన 30 పరుగులే అత్యధికం.
అనంతరం, స్వల్ప లక్ష్యంతో ఛేసింగ్‌కు దిగిన కోహ్లీ సేన 13.3 ఓవర్లలోనే 2 వికెట్లు నష్టపోయి సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోకి ఎగబాకి ప్లేఆఫ్‌కు మరింత చేరువైంది. ఆర్సీబీకి లీగ్ దశలో మరో 4 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇందులో ఏ 2 మ్యాచ్‌లు గెలిచినా, అధికారికంగా ప్లే ఆఫ్‌కు వెళ్లిన జట్టుగా నిలుస్తుంది.
బెంగళూరు విజయంలో హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. వేసిన 4 ఓవర్లలో కేవలం 8 పరుగులే ఇచ్చి ఆదిలోనే 3 కీలక వికెట్లను పడగొట్టాడు. అంతేకాదు సిరాజ్ వేసిన 4 ఓవర్లలో మొదటి రెండు మేయిడెన్ ఓవర్లు అయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో ఒక బౌలర్ వరుసగా 2 మేయిడెన్ ఓవర్లు సాధించడం ఇదే తొలిసారి. మరోవైపు మొత్తం 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి కేవలం 84 పరుగులు మాత్రమే చేయగలిగిన జట్టుగా కేకేఆర్ చెత్త రికార్డును మూటగట్టుకుంది.
స్కోర్ వివరాలు: కేకేఆర్ 20 ఓవర్లలో 84/8; ఆర్సీబీ 13.3 ఓవర్లలో 85/2. 4-2-8-3 గణాంకాలు నమోదు చేసిన మహ్మద్ సిరాజ్‌కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.