Mahendra Singh Dhoni (Photo Credits: Getty Images)

భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ఆగష్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం రోజున సంచలన ప్రకటన చేశారు. తాను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం అవుతుందనుకుంటున్న తరుణంలో అందరి ఎదురు చూపులు ధోనీ ఆట పైనే ఉన్న వేళ, ధోనీ రాణిస్తేనే అతడికి మళ్లీ జట్టులో చోటు లభిస్తుందని ఊహగానాలు వెల్లువెత్తున్న వేళ, ధోనీ అనూహ్యంగా తన రిటైర్మెంట్ ప్రకటించడం హాట్ టాపిక్ అయింది.

ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన 2019 ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్‌ చేతిలో ఓడిపోయినప్పుడు చివరిసారిగా భారత జెర్సీతో ధోని కనిపించారు. ఆనాడు మ్యాచ్ ఓడిపోవటం కంటే ధోనీ ఔట్ అవ్వటమే అందరి మనసులను కలిచి వేసింది. అప్పటి నుండి అతడు జట్టుకు దూరమయ్యారు, ధోనీకి విశ్రాంతి అని బోర్డ్ పెద్దలు ప్రకటించినప్పటికీ ఆ తర్వాత ఏ మ్యాచ్ లోనూ ధోనీని టీంలోకి మళ్లీ తీసుకోకపోవడంతో మహీ పునరాగమనంపై సస్పెన్స్ నేటి వరకుకొనసాగుతూ రాగా, నేడు స్వయంగా ధోనీనే ఆ సస్పెన్స్ కు తెరదించాడు.

"ఇన్నాళ్లుగా మీ ప్రేమాభిమానాలకు చాలా ధన్యవాదాలు, 19:26 నుంచి నేను రిటైర్ అవుతున్నట్లుగా భావించండి" అంటూ ఇన్ స్టాగ్రాంలో ధోనీ సింపుల్‌గా, తనదైన స్టైల్లో ఓ నిర్ణయాన్ని ప్రకటించారు.

Here's Mahi's Message:

 

View this post on Instagram

 

Thanks a lot for ur love and support throughout.from 1929 hrs consider me as Retired

A post shared by M S Dhoni (@mahi7781) on

అయితే అంతర్జాతీయ క్రికెట్ కు ధోనీ వీడ్కోలు పలికినా రాబోయే ఐపీఎల్ సీజన్ కు ధోనీ ఆడనున్నాడు, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. అయితే ఈ విషయాన్ని మాత్రం ధోనీ తన రిటైర్మెంట్ సందేశంలో ప్రస్తావించలేదు.

ఎం.ఎస్ ధోనీ ఇది పేరు కాదు.. ఒక బ్రాండ్

 

మహేంద్ర సింగ్ ధోని (M.S. Dhoni) ఇది కేవలం ఒక పేరు కాదు. ఇది ఒక బ్రాండ్. క్వాలిటీ క్రికెటింగ్‌కి బ్రాండ్, క్వాలిటీ కెప్టెన్సీకి బ్రాండ్, క్వాలిటీ వికెట్ కీపింగ్‌కి బ్రాండ్.  ఎంతో మంది లెజెండరీ క్రికెటర్స్ వచ్చారు, పోయారు కానీ ధోనీ లాంటి వాడు మరొకరు రాకపోవచ్చు.

ఇండియన్ క్రికెట్ టీమ్ (Indian Cricket Team) గురించి చెప్పుకోవాలంటే అది ధోనికి ముందు ధోని తర్వాత అని చెప్పుకోవాలి.  ఇండియన్ క్రికెట్ టీమ్ ఎప్పుడూ బలమైన జట్టే. సచిన్, గంగూలీ, ద్రావిడ్, సెహ్వాగ్ లాంటి ఆటగాళ్లతో పేపర్ మీద చూస్తే ఒక అభేద్యమైన బ్యాటింగ్ లైనప్‌తో పటిష్ఠంగా కనిపించేది. కానీ, ఎప్పుడు నిలకడగా ఆడుతుందో, ఎప్పుడు సైకిల్ స్టాండ్ లాగా కుప్పకూలుతుందో ఎవరు ఊహించలేని పరిస్థితి. చివరి దాకా వచ్చి విజయం ముంగిట్లో టీమిండియా బొక్కబోర్లా పడేది. అలాంటి సమయంలో జట్టులో ప్రవేశించిన ధోనీ ఏ మ్యాచ్ నైనా పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకునేవాడు. అప్పటివరకూ అసాధ్యం అనుకున్న విజయాన్ని తన విధ్వంసకర బ్యాటింగ్‌తో సాధ్యం చేసి బెస్ట్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. చప్పగా సాగే మ్యాచ్‌లు ధోనీ రాగానే స్టేడియం నలువైపులా ధనాధన్ ఫోర్లు, సిక్సులతో మారుమోగింది. ఇదేం బ్యాటింగ్? ఒక టెక్నిక్ లేదు, ఒక క్లాస్ లేదు అని పెదవి విరిచిన వాళ్లూ చాలా మందే. అయితే ధోనీ అవేమి పట్టించుకోకుండా తనకు తెలిసిన బాదుడుతోనే వారికి సమాధానం ఇచ్చాడు.

2007 ప్రపంచ కప్ లో భారత్ ఘోర ఓటమి

ధోని జట్టులోకి వచ్చిన మూడేళ్ల తర్వాత 2007 వన్డే ద్రవిడ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సమయంలో 2007 వన్‌డే ప్రపంచ కప్‌లో ఘోర ఓటములతో లీగ్ దశలోనే టోర్నమెంట్ నుంచి తప్పుకుంది. అప్పట్లో జట్టు పరిస్థితి దారుణంగా తయారైంది. జట్టును నడిపించడమంటేనే అదొక భారం. 2007 ప్రపంచ కప్ లో టీమిండియా ప్రదర్శనను భారత అభిమానులు జీర్ణించుకోలేదు. అప్పట్లో టీమిండియా సభ్యుల ఇళ్లపై దాడులు, ఆటగాళ్లకు వ్యతిరేకంగా ర్యాలీలు, నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ కాలంలో భారత క్రికెట్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది.

2007 టీ20 ప్రపంచ కప్ సారథిగా ఎం. ఎస్ ధోని, విశ్వవిజేత భారత్.

క్రికెట్ మ్యాచ్ లు మరీ చప్పగా సాగుతున్న రోజులవి. టెస్టుల్లాంటి వన్డే మ్యాచ్ లు చూడాలంటేనే, క్రికెట్ పై ప్రేక్షకుల్లో నిరాసక్తత పెరిగిపోతుతున్న రోజులవి. అయితే 2007 వన్డే ప్రపంచకప్ జరిగిన కొన్ని నెలలకే అదే ఏడాది చివర్లో అనూహ్యంగా ఐసీసీ సరికొత్తగా టీ-20 మ్యాచ్ లను ప్రవేశపెడుతూ టీ-20 ప్రపంచ కప్ ను అనౌన్స్ చేసింది. అయితే మన ఇండియన్ క్రికెటర్స్ కి ఈ ఫార్మాట్ ఏమాత్రం ఇష్టం లేదు, అప్పటికే క్లాస్ కి అలవాటుపడిన మన క్రికెటర్లు, ఈ సూపర్ ఫాస్ట్ క్రికెట్ వల్ల తమ క్లాస్ దెబ్బతింటుందని ఆ ప్రపంచ కప్ ఆడేందుకు తమ అయిష్టతను ప్రకటించారు.

దీంతో టీ-20 ప్రపంచ కప్ లో టీమిండియాను ఎలా ఆడించాలి అని ఆలోచించిన బీసీసీఐ, సీనియర్లను పక్కనబెట్టి జూనియర్ ఆటగాళ్లతోనే ఒక తన టీమిండియా 'Team B'ను ప్రపంచకప్ కు సిద్ధం చేసింది. ధోనీని కెప్టెన్ గా ఎంపిక చేసింది.

ఆ తర్వాత 2007 టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా విజయాలు, జూనియర్ టీంతో బయలు దేరి తన తొలి ప్రయత్నంలోనే ఐసీసీ తొలి టీ20 ప్రపంచకప్ ను భారత్ ఖాతాలో వేసిన కెప్టెన్ గా ఎం.ఎస్ ధోనీ రికార్డులకెక్కాడు. పాకిస్థాన్ తో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో ధోనీ మాయజాలంతో నెగ్గిన భారత జట్టు టీ20 విశ్వవిజేతగా నిలవడం ఎప్పటికీ చిరస్మరణీయం.

వన్ డే కెప్టెన్ గా ధోని ఎంపిక, 2011 విశ్వవిజేతగా భారత్ అవతరణ

టీ20లో భారత్ సత్తా చాటినా వన్డే విషయానికి వచ్చే సరికి టీమిండియాలో ఎలాంటి మార్పు రాలేదు. మళ్ళీ వరుస పరాజయాలు. టీ20 ప్రపంచ కప్ భారత్ గెలవటం గాలివాటమే అని విమర్శలు వచ్చాయి. జట్టు పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ నేపథ్యంలో ద్రవిడ్ కెప్టెన్సీపై ఎన్నో విమర్శలు. ఈ పరిణామాలతో కెప్టెన్సీకి ద్రవిడ్ వీడ్కోలు చెప్పగా, సచిన్ - అనిల్ కుంబ్లే సూచన మేరకు బీసీసీఐ ధోనీకి జట్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది.

ఇక అది మొదలు ధోని ఆట కాదు వేట మొదలైంది. విప్లవాత్మక నిర్ణయాలతో తన సొంత టీంను తయారు చేసుకొని ఆ తర్వాత జరిగిన 2011 ప్రపంచ కప్‌లో భారత్‌ను విశ్వవిజేతగా నిలిపి, 28 ఏళ్ల తర్వాత భారత ప్రపంచ కప్ కలను నెరవేర్చాడు.

ధోనీ వేట అంతకు ఆగలేదు.  అనిల్ కుంబ్లే  రిటైర్మెంట్ తర్వాత వారసత్వంగా టెస్టు కెప్టెన్సీ పగ్గాలూ అందుకున్న ధోనీ టెస్టుల్లో టీమిండియాను నెం.1 ర్యాంక్ లో నిలిపాడు. ఇక ఫార్మాట్ తో సంబంధం లేకుండా టీమిండియా ఆడే ప్రతీ సిరీస్ ను తన అద్భుతమైన కెప్టెన్సీతో గెలిపిస్తూ గెలుపుకి టీమిండియాను ఒక నిర్వచనంగా మార్చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫి, ఆసియా కప్ ఇలా ఒకటేమిటి ఐసీసీ అన్ని మెగాటోర్నమెంటుల్లో టీమిండియాను విజేతగా నిలిపిన కెప్టెన్ కూల్ ఎం.ఎస్ ధోనీ.