Bhopal, Nov 15: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని నళ్ల కోళ్ల వ్యాపారాన్ని (MS Dhoni Set for Poultry Farming) ప్రారంభించేందుకు సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. సిరులు కురిపించడంతో పాటు అత్యధిక పోషక విలువలు కలిగి ఉండే నల్లకోళ్లు ‘కడక్‌నాథ్’ (Kadaknath Chicks) పెంపకంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రాంచీలోని తన 43 ఎకరాల ఫాంహౌజ్‌లో ఆర్గానిక్ పౌల్ట్రీ పరిశ్రమను నెలకొల్పేదిశగా మహీ టీం ముందుకు సాగుతోంది. ఈ మేరకు ధోని బృందం ఆర్డర్ చేసిన 2 వేల కోడి పిల్లలు, డిసెంబరు 15న రాంచీకి డెలివరీ కానున్నట్లు సమాచారం.
ఈ మేరకు మధ్యప్రదేశ్ గిరిజన రైతు వినోద్ మెండాతో వీరు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయం గురించి మధ్యప్రదేశ్‌లోని జబువాలో గల కడక్‌నాథ్ ముర్గా రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ఐఎస్ తోమర్ మీడియాతో మాట్లాడుతూ.. కోళ్ల పెంపకం విషయమై ధోని తమను సంప్రదించాడని, అయితే ఆ సమయంలో తమ వద్ద కోడి పిల్లలు అందుబాటులో లేనందున రైతు నంబరు ఆయనకు ఇచ్చినట్లు పేర్కొన్నారు
2019 వన్డే ప్రపంచకప్ సెమీస్లో భారత జట్టు ఓటమి పాలైనప్పటి నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్న మహేంద్రుడు ఈ విరామ సమయంలో సేంద్రియ వ్యవసాయానికి శ్రీకారం చుట్టాడు. కూరగాయలు, వివిధ రకాల పండ్లు పండించడంతో పాటుహరియాణాకు చెందిన సహీవాల్ ఆవులతో డెయిరీ, వ్యవసాయ క్షేత్రంలోని ఒక పెద్ద చెరువులో చేపల పెంపకం కూడా చేస్తున్నాడు. ఇప్పుడు వీటన్నింటితోపాటు కడఖ్‌నాథ్ కోళ్ల పెంపకాన్ని కూడా చేపట్టనున్నాడు. పోషక విలువలు అధికంగా ఉండే ఈ కోడిమాంసానికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.