డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మరోసారి దుమ్మురేపింది, ఈ సీజన్ ఐపీఎల్2020లో లీగ్ దశలో సత్తా చాటి టేబుల్ టాపర్ గా నిలిచిన ముంబై జట్టు, ప్లేఆఫ్స్ లో భాగంగా ఫైనల్ బెర్తును నిర్ణయించే కీలక మ్యాచ్ లో ప్రత్యర్థిని మట్టికరిపించింది. గురువారం ముంబై ఇండియన్స్ మరియు దిల్లీ క్యాపిటల్స్ కు మధ్య జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి నేరుగా ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. అయితే, ఈ మ్యాచ్ లో దిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయినప్పటికీ ఆ జట్టుకు మరొక అవకాశం మిగిలే ఉంది.
మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ఆరంభించిన ముంబై జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఒపెనర్ గా వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ ఆడిన తొలి బంతికే గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగాడు. రవిచంద్రన్ అశ్విన్ ఈ వికెట్ తీసుకున్నాడు. అయినప్పటికీ ముంబై జట్టులో మిగతా బ్యాట్స్ మెన్ రాణించారు. సూర్యకుమార్ యాదవ్ 38 బంతుల్లో 51, 30 బంతుల్లో 55* అర్ధసెంచరీలతో ఆకట్టుకోగా, క్వింటన్ డికాక్ భారీ షాట్లతో దిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. చివర్లో పొలార్డ్ కూడా డకౌట్ గా వెనుదిరిగి నిరాశపరిచాడు. ఈ వికెట్ కూడా అశ్విన్ తీశాడు. అయితే హార్ధిక్ పాండ్యా మాత్రం తన పవర్ మరోసారి చూపించాడు. 14 బంతుల్లోనే 5 సిక్సర్లు బాది 37 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగుల భారీస్కోరు సాధించింది. దిల్లీ బౌలర్లతో అశ్విన్ ఒక్కడే 3 వికెట్లతో రాణించాడు.
అనంతరం 201 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ క్యాపిటల్స్ ముంబై బౌలర్ల ధాటికి విలవిలలాడారు. దిల్లీ జట్టులో తొలి ముగ్గురు బ్యాట్స్ మెన్ అసలు పరుగులేమి చేయకుండానే డకౌట్స్ గా వెనుదిరిగారు. పృథ్వీ షా, శిఖర్ ధవన్, అజింక్య రహానే డకౌట్ అయ్యారు. దీంతో 1.2 ఓవర్లలో దిల్లీ జట్టు 0 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అనంతరం వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా 12 పరుగులే చేసి నిరాశ పరిచాడు. అయితే అవతలి ఎండ్ లో ఉన్న మరో బ్యాట్స్ మెన్ మార్కస్ స్టోనిస్ మాత్రం ముంబై బౌలర్లకు ఏమాత్రం బెదరకుండా భారీషాట్లు ఆడాడు. 20/4 స్థితిలో ఉన్న ముంబై జట్టు ఇన్నింగ్స్ ను స్టోనిస్ చక్కదిద్దాడు. 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేసి ఆ జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివర్లో అక్సర్ పటేల్ కూడా 33 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు చేసి రాణించడంతో దిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 143 మాత్రమే చేయగలిగింది. దీంతో ముంబై జట్టు 57 పరుగుల తేడాతో గెలిచి ఐపీఎల్ 2020లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా రికార్డ్ సాధించింది.
మరోవైపు దిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ చేరేందుకు మరొక అవకాశం మిగిలే ఉంది. శుక్రవారం సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఓడిపోయిన జట్టు ఐపీఎల్2020 నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. అయితే గెలిచిన జట్టు మాత్రం దిల్లీ క్యాపిటల్స్ తో ప్లేఆఫ్స్ మ్యాచ్ 3 ఆదివారం ఆడాల్సి ఉంటుంది. దీంట్లో గెలిచిన జట్టు మంగళవారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో తలపడుతుంది.