KXIP vs MI Highlights: రోహిత్ శర్మ, పొలార్డ్‌ల హార్డ్ హిట్టింగ్‌తో చిత్తైన పంజాబ్ కింగ్స్, 48 పరుగుల తేడాతో ముంబై గెలుపు, ఈరోజు హైదరాబాద్ మరియు చెన్నైల మధ్య ఆసక్తికర పోరు
Rohit Sharma and Krunal Pandya (Photo Credits: PTI)

ముంబై ఇండియన్ మరియు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్ల మధ్య గురువారం జరిగిన ఐపీఎల్ టీ20 మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 48 పరుగుల తేడాతో సునాయాస విజయాన్ని నమోదు చేసింది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లోనూ సూపర్ హిట్ అయ్యాడు, 45 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులు పూర్తి చేశాడు. మంచి స్పీడ్ అందుకున్న టైంలో భారీ హిట్ కు ప్రయత్నించి బౌండరీ వద్ద అద్భుతమైన క్యాచ్ తో రోహిత్ వెనుదిరిగాడు. అయితే రోహిత్ ఈ ఐపీఎల్ సీజన్ లో రెండో హాఫ్ సెంచరీ పూర్తి చేయడం విశేషం.

ముంబై 150 పరుగులు చేస్తుందనుకుంటున్న తరుణంలో ఇన్నింగ్స్ చివర్లో హార్ధిక్ పాండ్య, పొలార్డ్ ల జోడి బలమైన హిట్టింగ్స్ చేస్తూ ఫోర్లు, సిక్సర్లు బాదడంతో స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. పొలార్డ్ 20 బంతుల్లోనే 47 పరుగులు చేయగా, అవతల ఎండ్ నుంచి హార్ధిక్ పాండ్యా కూడా 11 బంతుల్లో 30 పరుగులు రాబట్టారు. దీంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు 4 వికెట్లు నష్టపోయి 191 పరుగులు చేసింది.

అటు తర్వాత 192 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్ కు దిగిన పంజాబ్ ధాటిగా ఆడలేకపోయింది. వికెట్లను నిలుపుకునేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. ఈ క్రమంలో అతిగా ఆత్మరక్షణకు పోయి కీలక సమయాల్లో పంజాబ్ బ్యాట్స్ మెన్ వికెట్లు చేజార్చుకున్నారు. పంజాబ్ జట్టులో నికోలస్ పూరన్ ఒక్కడే 27 బంతుల్లో 44 పరుగులు చేసిన పరుగులు మినహా మిగతా బ్యాట్స్ మెన్ ఎవరూ కూడా 30 రన్స్ కూడా చేయలేకపోయారు. దీంతో పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బౌలర్ కృనాల్ పాండ్య 3 వికెట్లు తీశాడు. ముంబై బ్యాట్స్ మెన్ పోలార్డ్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

ఇక ఈరోజు మ్యాచ్ విషయానికి వస్తే, శుక్రవారం హైదరాబాద్ మరియు చెన్నై జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఎన్నో అంచనాలు ఉన్న ఈ రెండు జట్లు ఆడిన 3 మ్యాచుల్లో కేవలం 1 మాత్రమే గెలిచి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ రెండు జట్లకు గెలుపు కీలకం, ఈ నేపథ్యంలో ఈరోజు మ్యాచ్ లో మంచి గేమ్ చూడవచ్చు. హైదరాబాద్ బలం బౌలింగ్, చెన్నై బలం బ్యాటింగ్. చూడాలి, ఎవరిది పైచేయి అవుతుందో!