Marcus Stoinis & Hardik Pandya (Photo Credits: Twitter)

ఐపీఎల్ తుది దశకు చేరుకుంది. 52 రోజుల పాటు అభిమానులను అలరించిన టోర్నీ ఇప్పుడు చివరి ఘట్టానికి (MI vs DC IPL 2020 Final) చేరింది. ఆసాంతం అద్భుత వినోదం పంచిన లీగ్‌లో ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది. నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ ఒకవైపు... పదమూడో ప్రయత్నంలో ఫైనల్‌ చేరి మొదటి ఐపీఎల్‌ టైటిల్‌ వేటలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ మరోవైపు పోరుకు ‘సై’ (Mumbai Indians vs Delhi Capitals) అంటున్నాయి.రాత్రి గం. 7.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఐదో టైటిల్‌పై గురి పెట్టగా.. లీగ్‌లో తొలిసారి ఫైనల్‌ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) టైటిల్‌ను సొంతం చేసుకొని చరిత్ర సృష్టించాలనుకుంటోంది. క్వాలిఫయర్‌-1లో ముంబై చేతిలో చిత్తుగా ఓడిన ఢిల్లీ.. ఈసారి ఎలాగైనా బదులు తీర్చుకోవాలనే కసితో కనిపిస్తోంది. ఈ సీజన్‌లో ఆడిన 15 మ్యాచ్‌ల్లో రోహిత్‌ సేన పది నెగ్గింది. శ్రేయాస్‌ అయ్యర్‌ నేతృత్వంలోని ఢిల్లీ ఆడిన 16 మ్యాచ్‌ల్లో 9 మ్యాచ్‌లు నెగ్గింది. క్వాలిఫయర్‌-2లో హైదరాబాద్‌పై సాధికార విజయంతో.. టైటిల్‌ పోరులో ముంబైతో ఢీ కొట్టేందుకు రెడీ అయింది. ఇప్పటివరకు 2013, 2015, 2017, 2019ల్లో ముంబై విజేతగా నిలిచింది. 2010లో ఫైనల్‌ చేరినా చెన్నై చేతిలో ఓడింది.

తొలిసారిగా ఫైనల్‌కు చేరిన ఢిల్లీ, పోరాడి ఓడిన హైదరాబాద్, 17 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం, ముంబైతో ఫైనల్ పోరు

ఈసారి ఐపీఎల్‌లో ప్రైజ్‌మనీని భారీగా తగ్గించారు. చాంపియన్‌గా నిలిచిన జట్టుకు రూ. 10 కోట్లు ఇవ్వనున్నారు. గత ఏడాది విజేత జట్టుకు రూ. 20 కోట్లు లభించాయి. ఈసారి రన్నరప్‌ జట్టుకు రూ. 6 కోట్ల 25 లక్షలు దక్కుతాయి. గత ఏడాది రన్నరప్‌ జట్టు ఖాతాలో రూ. 12 కోట్ల 50 లక్షలు చేరాయి. ఈసారి ప్లే ఆఫ్‌ దశలో ఓడిన రెండు జట్లకు రూ. 4 కోట్ల 37 లక్షల 50 వేల చొప్పున ప్రైజ్‌మనీ కేటాయించారు.

ఢిల్లీ క్యాపిటల్స్‌కు శిఖర్‌ ధవన్‌, స్టొయినిస్‌, అయ్యర్‌, రబాడ కీలకం కానున్నారు. సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ ముంబై ఇండియన్స్‌కు ప్రధాన బలంగా కనిపిస్తోంది. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ స్థాయికి తగ్గట్లు ఆడకపోయినా.. ఆ జట్టు ఎలాంటి ఇబ్బంది పడలేదంటే ఈ ఇద్దరు యువ ఆటగాళ్లే కారణం. వీరితో పాటు డికాక్‌, పాం డ్యా బ్రదర్స్‌, పొలార్డ్‌ బ్యాటింగ్‌లో.. బు మ్రా, బౌల్ట్‌ బౌలింగ్‌లో మెరిస్తే ముంబై ఐదోసారి కప్పు కొట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

జట్లు (అంచనా)

ముంబై: రోహిత్‌ శర్మ, డికాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా, పొలార్డ్‌, క్రునాల్‌ పాండ్యా, కల్టర్‌నైల్‌, రాహుల్‌ చాహర్‌, బౌల్ట్‌/ప్యాటిన్సన్‌, బుమ్రా.

ఢిల్లీ: ధవన్‌, స్టొయినిస్‌, రహానె, శ్రేయాస్‌ అయ్యర్‌, హెట్‌మయర్‌, పంత్‌, అక్షర్‌ పటేల్‌, ప్రవీణ్‌ దూబె/హర్షల్‌ పటేల్‌, రబాడ, అశ్విన్‌, నోకియా.