పూణే వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజున టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రాణించిన విషయం తెలిసిందే. మూడు కీలకమైన వికెట్లు తీసి తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ను 259 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్ 7 వికెట్లు తీసినప్పటికీ అతడి కంటే ముందే అశ్విన్ తొలి మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
కివీస్ కీలక బ్యాటర్లు టామ్ లాథమ్, విల్ యంగ్, డెవోన్ కాన్వేలను అశ్విన్ పెవిలియన్‌కు పంపించాడు. కాగా లాథమ్ వికెట్‌ను ఎల్‌బీడబ్ల్యూ రూపంలో తీయడంతో అంతర్జాతీయ క్రికెట్‌లో అశ్విన్ అరుదైన రికార్డును సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 150 వికెట్లు ఎల్‌బీడబ్ల్యూ ఔట్‌ల రూపంలో సాధించిన రెండవ బౌలర్‌గా నిలిచాడు. టామ్ లాథమ్ వికెట్‌తో టెస్టుల్లో 116వ ఎల్‌బీడబ్ల్యూని అశ్విన్ అందుకున్నాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక ఎల్‌బీడబ్ల్యూలు చేసిన బౌలర్లలో ముత్తయ్య మురళీధరన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే టెస్టుల్లో మురళీధరన్ (110) కంటే అశ్విన్ (116) అగ్రస్థానంలో నిలిచాడు.
అత్యధిక ఎల్‌బీడబ్ల్యూ అవుట్‌లు చేసిన బౌలర్లు..
1. ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) - 166
2. ఆర్ అశ్విన్ (భారత్) - 150
3. చమిందా వాస్ (శ్రీలంక) - 131
4. డానియల్ వెట్టోరి (న్యూజిలాండ్) -131
5. అనిల్ కుంబ్లే (భారత్) - 128.