London, September 5: ఇంగ్లండ్ లో పర్యటిస్తున్న టీమిండియాలో మరోసారి కరోనా కలకలం రేగింది. ఇటీవల కొందరు ఆటగాళ్లకు కరోనా సోకగా, ఈసారి హెడ్ కోచ్ రవిశాస్త్రి కరోనా (Ravi Shastri Tests Positive) బారినపడ్డారు. ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్ అని తేలింది. దాంతో ఆయనను, టీమిండియా కోచింగ్ సిబ్బందిని ఐసోలేషన్ కు (Team India Support Staff Isolated) తరలించారు. ఐసోలేషన్ కు తరలించిన వారిలో బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్, ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటేల్ ఉన్నారు.
రవిశాస్త్రికి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆర్టీ-పీసీఆర్ టెస్టు కూడా నిర్వహించారు. ఈ టెస్టు ఫలితం వచ్చేవరకు ఆయనను ఐసోలేషన్ లో ఉంచనున్నారు. అయితే టీమిండియా ఆటగాళ్లలో ఎవరూ కరోనా బారినపడలేదని, ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టెస్టుకు ఎలాంటి ఆటంకాలు లేవని మేనేజ్ మెంట్ స్పష్టం చేసింది. రవిశాస్త్రికి కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఆటగాళ్లకు, సహాయక సిబ్బంది మొత్తానికి ర్యాపిడ్ యాంటీజెన్, ఆర్టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించారు.