Jadeja fastest left-arm bowler to 200 Test wickets (photo-Ians)

Nagpur, FEB 06: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్‌ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో 600 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఐదో భారత బౌలర్‌ జడేజా. జడ్డూ 80 టెస్టు మ్యాచుల్లో 323 వికెట్లు, వన్డేల్లో 233 వికెట్లు, 72టీ20 మ్యాచ్‌లో 54 వికెట్లు తీశాడు. టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే 401 మ్యాచుల్లో 953 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్‌ 287 మ్యాచుల్లో 765, ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ 365 మ్యాచుల్లో 707 వికెట్లు పడగొట్టాడు. కపిల్‌ దేవ్‌ 356 మ్యాచుల్లో 687 వికెట్లు తీశారు. జడేజా 600 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. జహీర్‌ ఖాన్‌ (597), జవగల్‌ శ్రీనాథ్‌ (551), మహ్మద్‌ షమీ (452) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

IND Win By Four Wickets: తొలి వన్డేలో4 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం, చెలరేగిన శుభ్‌మన్‌ గిల్ 

నాగ్‌పూర్‌ వన్డేతో ఫాస్ట్‌ బౌలర్‌ హర్షిత్‌ రాణా టీమిండియా తరఫున తొలిసారిగా బరిలోకి దిగాడు. రవీంద్ర జడేజాతో కలిసి ఇంగ్లాండ్‌ను బౌలింగ్‌తో వణికించాడు. ఇద్దరు బౌలర్లు రాణించడంతో ఇంగ్లాండ్‌ 47.4 ఓవర్లలో 248 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ తరఫున కెప్టెన్ జోస్ బట్లర్, జాకబ్ బెతెల్ హాఫ్‌ సెంచరీలు సాధించారు. దాంతో ఆ జట్టు ఆ మాత్రం స్కోర్‌ చేయగలిగింది. హర్షిత్‌ రాణా, రవీంద్ర జడేజా చెరో మూడు వికెట్లు తీశారు. మహ్మద్‌ షమీ, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌ చెరో వికెట్‌ తీశారు. ఇంగ్లాండ్ తరఫున బట్లర్ 52 పరుగులు, బెతెల్‌ 51 పరుగులు, సాల్ట్ 43 పరుగులు, డకెట్‌ 32 పరుగులు సాధించారు,

అలాగే, జడేజా మరో ఘనత సాధించాడు. భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌పై ఇప్పటి వరకు వన్డేల్లో 42 వికెట్లు తీశాడు. రెండు దేశాల మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో 40 వికెట్లు తీసిన జేమ్స్‌ అండర్సన్‌ను వెనక్కి నెట్టి.. లిస్ట్‌లో అగ్రస్థానానికి చేరాడు. అండర్సన్‌ 40 వికెట్లతో రెండోస్థానంలో ఉండగా.. 37 వికెట్లతో ఆండ్రూ ప్లింటాఫ్‌ మూడో ప్లేస్‌, 36 వికెట్లతో హర్భన్‌ సింగ్‌ నాలుగో ప్లేస్‌లో ఉన్నాడు.