Nagpur, FEB 06: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత్ (Team India Won) శుభారంభం చేసింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై టీమ్ఇండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం (Team India Won) సాధించింది. 249 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి 38.4 ఓవర్లలో ఛేదించింది. భారత బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (87; 96 బంతుల్లో 14 ఫోర్లు), శ్రేయాస్ అయ్యర్ (59; 36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అక్షర్ పటేల్ (52; 47 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. రోహిత్ శర్మ (2), కేఎల్ రాహుల్ (2) లు విఫలం కాగా.. యశస్వి జైస్వాల్ (15; 22 బంతుల్లో 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్ చెరో రెండు వికెట్లు తీశారు. జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్ చెరో వికెట్ పడగొట్టారు. ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. మూడు ఫోర్లతో మంచి ఊపులో కనిపించిన అరంగ్రేట ఆటగాడు యశస్వి జైస్వాల్ ను జోఫ్రా ఆర్చర్ బోల్తా కొట్టించాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే తన పేలవ ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతను వన్‌డౌన్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill), నాలుగో స్థానంలో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్‌లు భుజాన వేసుకున్నారు. చాలాకాలం తరువాత వచ్చిన వన్డే జట్టులోకి వచ్చిన శ్రేయస్.. టీ20 తరహాలో చెలరేగాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ కేవలం 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు గిల్ ఆరంభంలో క్రీజులో కుదురుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చాడు. కుదురుకున్నాక తనదైన శైలిలో పరుగులు రాబట్టాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని శ్రేయస్‌ను ఔట్ చేయడం ద్వారా జాకబ్ బెథెల్ విడగొట్టాడు. శ్రేయస్, గిల్ జోడి మూడో వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
శ్రేయస్ ఔట్ అయినా గానీ ఇంగ్లాండ్‌కు ఆనందించడానికి ఏమీ లేకపోయింది. బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ పొందిన అక్షర్ పటేల్ ఐదో స్థానంలో వచ్చాడు. అతడు కూడా ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. గిల్ 60 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి కోగా.. అక్షర్ సైతం 46 బంతుల్లో అర్థశతకం సాధించాడు. హాఫ్ సెంచరీ సాధించిన వెంటనే అక్షర్ పటేల్.. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అక్షర్, గిల్ జోడి నాలుగో వికెట్ కు 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తరువాత రాహుల్, గిల్ స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరుకున్నా.. హార్దిక్ పాండ్యా(9 నాటౌట్) తో కలిసి రవీంద్ర జడేజా (12 నాటౌట్) భారత్‌కు విజయాన్ని అందించాడు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్ (52), జాకబ్ బెథెల్ (51) హాఫ్ సెంచరీలు చేశారు. ఫిలిప్ సాల్ట్ (43), బెన్ డకెట్ (32) లు రాణించారు. హ్యారీ బ్రూక్ (0), లిమాయ్ లివింగ్ స్టోన్ (5), జో రూట్ (19) లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా లు చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ లు తలా ఓ వికెట్ సాధించారు.