Bangalore, March 14: ప్రతీ సీజన్‌కు ముందు కప్పు మనదే అంటూ రావడం చివరికి ఊసూరుమనిపించడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అలవాటుగా మారింది. 16 సీజన్లు ముగిసిన ఐపీఎల్ ట్రోఫీ ఆర్‌సీబీకి అందని ద్రాక్షగానే మిగిలింది. ఇప్పుడు 17వ సీజన్ మొదలు కానున్న నేపథ్యంలో ఈ సారి అయినా ఆ జట్టు ట్రోఫీ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఆర్‌సీబీ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పలుమార్లు ఆ టీమ్ లోగోతో పాటు కోచ్, ఆటగాళ్లను మార్చినా ఫలితం కనిపించలేదు. అందుకనే ఈ సారి ఆ జట్టు పేరును స్వల్పంగా మార్చాలని భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఆర్‌సీబీ తన పేరును ఇంగ్లీష్‌లో Royal Challengers Bangalore గా రాస్తోంది. ఇకపై Royal Challengers Bengaluru గా మార్చనుందని అంటున్నారు. ఆర్‌సీబీ విడుదల చేసిన ఓ వీడియో ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. ఈ వీడియోలో శాండల్‌వుడ్ స్టార్ హీరో రిషబ్ శెట్టి కనిపించాడు. మూడు దున్నలపై రాయల్ (Royal), ఛాలెంజర్స్(Challengers), బెంగళూరు(Bangalore) అని రాసి ఉంటుంది. ఇందులో బెంగళూరు(Bangalore) అని రాసి ఉన్న దున్నను తీసుకుపొమ్మని అంటాడు.
క్రికెటేతర ఆటల్లో Bangalore అని కాకుండా Bengaluru అని రాస్తుంటారు. ఈ క్రమంలో ఆర్‌సీబీ పేరును అలా మార్చాలని పలువురు ఫ్యాన్స్ కోరారు. దీంతో పేరు మార్పును చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మార్చి 19 బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆన్‌బాక్స్ పేరుతో ఓ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌లో పేరు మార్పుపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మార్చి 22న ఐపీఎల్ ఆరంభం కానుంది. మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్‌కు చెన్నైలోని చెపాక్ మైదానం వేదిక కానుంది.