RCB (Photo-IPL)

రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు వ‌రుస ఓట‌ముల‌కు గుడ్ బై చెప్పింది. సమిష్టి ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. ప్రత్యర్థి జట్టును 23 పరుగుల తేడాతో ఓడించి జయకేతనం ఎగురవేసింది. తద్వారా ఐపీఎల్‌-2023లో రెండో విజయం నమోదు చేసింది. ఢిల్లీ ఐదో ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది.

ఐపీఎల్‌-2023లో భాగంగా సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్‌ శుభారంభం అందించారు. కోహ్లి అర్ధ శతకంతో మెరువగా.. డుప్లెసిస్‌ 22 పరుగులు సాధించాడు. మిగిలిన వాళ్లలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ మహిపాల్‌ లామ్రోర్‌ 26, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ 24 పరుగులు చేశారు. హర్షల్‌ పటేల్‌ 6 పరుగులకే పెవిలియన్‌ చేరగా.. షాబాజ్‌ అహ్మద్‌ (12 బంతుల్లో 20 పరుగులు నాటౌట్‌) ఫర్వాలేదనిపించాడు.

సెంచరీతో చెలరేగిన బ్రూక్స్, వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ గెలుపు, రూ. 13 కోట్లకు న్యాయం చేశాడంటున్న ఫ్యాన్స్

ఇక దినేశ్‌ కార్తిక్‌ డకౌట్‌గా వెనుదిరగగా.. అనూజ్‌రావత్‌ 22 బంతుల్లో 15 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక ఢిల్లీ బౌలర్లలో మిచెల్‌ మార్షల్‌, కుల్దీప్‌ యాదవ్‌ రెండేసి వికెట్లు తీయగా.. అక్షర్‌ పటేల్‌ ఒకటి, లలిత్‌ యాదవ్‌ ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేయగలిగింది. ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఢిల్లీని మనీశ్‌ పాండే అర్ధ శతకంతో ఆదుకున్నాడు. మిగతా వాళ్లలో అక్షర్‌ పటేల్‌(21), అన్రిచ్‌ నోర్జే(23 నాటౌట్‌) మాత్రమే 20 పరుగుల మార్కు అందుకున్నారు. దీంతో ఢిల్లీకి మరో ఓటమి తప్పలేదు.

ఇదిలా ఉంటే.. ఆర్సీబీ అరంగేట్ర బౌలర్‌ విజయ్‌కుమార్‌ వైషాక్‌ 3 వికెట్లతో చెలరేగడం విశేషం. ఢిల్లీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌, అక్షర్‌ పటేల్‌, లలిత్‌ యాదవ్‌ రూపంలో కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మిగిలిన వాళ్లలో సిరాజ్‌కు రెండు, పార్నెల్‌, హసరంగ, హర్షల్‌ పటేల్‌లకు ఒక్కో వికెట్‌ దక్కాయి.