Virat Kohli and AB de Villiers celebrate after winning the Super Over (Photo Credits: PTI)

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ‘సూపర్‌’ విక్టరీని (Royal Challengers Bangalore Win Super Over After Tied Match) నమోదు చేసింది. సూపర్‌ ఓవర్‌కు దారి తీసిన మ్యాచ్‌లో (RCB vs MI Highlights IPL 2020) ఆర్సీబీ విజయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్ లో సిక్స్‌ల వరద పారింది. క్రికెట్‌ అభిమానుల్ని తెగ అలరించిన ఈ మ్యాచ్‌లో (Royal Challengers Bangalore vs Mumbai Indians) చివరకు సూపర్‌ ఓవర్ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు (ఆర్‌సీబీ) ని విజయతీరాలకు చేర్చింది. ముంబై ఇండియన్స్‌ పోరాటం ఆ ఓవర్‌లోనే ఆవిరైంది.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డివిలియర్స్‌ (24 బంతుల్లో 55 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఫించ్‌ (35 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్‌), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (40 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించారు. తర్వాత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి సరిగ్గా 201 పరుగులు చేయడంతో మ్యాచ్‌ ‘టై’ అయ్యింది. ముంబై తరపున ఇషాన్‌ కిషన్‌ (58 బంతుల్లో 99; 2 ఫోర్లు, 9 సిక్సర్లు) పరుగు తేడాతో సెంచరీకి దూరమైనా భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. పొలార్డ్‌ (24 బంతుల్లో 60 నాటౌట్‌; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) వణికించాడు. కాగా కోహ్లి (3) వరుసగా మళ్లీ విఫలమయ్యాడు. ఈ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో అతను 14, 1, 3 స్కోర్లతో నిరాశపరిచాడు. చిత్రమేమిటంటే యూఏఈ గడ్డపై ఇప్పటిదాకా ఈ స్టార్‌ క్రికెటర్‌ బ్యాట్‌ నుంచి ఒక్క బౌండరీ కూడా వెళ్లలేదు.

202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి తొలి ఓవర్‌లోనే ఓపెనర్లు రోహిత్‌ డికాక్‌ 14 పరుగులను రాబట్టారు. ఆరంభం అదిరిందిలే అనుకుంటుండగా వరుస ఓవర్లలో రోహిత్‌ శర్మ (8)ను సుందర్, సూర్యకుమార్‌ (0)ను ఉదాన అవుట్‌ చేయడం ముంబైని కష్టాల్లోకి నెట్టింది. దీన్నుంచి తేరుకోకముందే మరో ఓపెనర్‌ డికాక్‌ (14)ను చహల్‌ ఔట్‌ చేశాడు. 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్‌ ఆ తర్వాత మ్యాచ్‌ సాగేకొద్దీ లక్ష్యానికి దూరమైంది. జట్టు స్కోరు 50 చేరేందుకే 7.5 ఓవర్లు ఆడింది. 14 ఓవర్లు ముగిసినా వందనే చేరలేదు. 98/4 స్కోరు చేయగా... ఇక మిగిలిన 6 ఓవర్లలో 103 పరుగులు కావాలి. ఇలాంటి స్థితిలో 17వ ఓవర్‌ ముంబై దశనే మార్చింది. 2 క్యాచ్‌లు నేలపాలు కావడంతో పొలార్డ్‌ ఓవర్‌ అసాంతం చితగ్గొట్టాడు. 4, 6, 6, 2, 6, 3లతో మొత్తం 27 పరుగులు రావడంతో జట్టు స్కోరు అనూహ్యంగా 149/4కు చేరింది.

గత మ్యాచ్‌ (పంజాబ్, రాజస్తాన్‌) అనుభవం దృష్ట్యా ఇక 18 బంతుల్లో 53 పరుగులు కష్టంగా కనిపించలేదు. చహల్‌ 18వ ఓవర్లో 3 భారీ సిక్సర్లు బాదిన పొలార్డ్‌ 20 బంతుల్లోనే (2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. చహల్‌ కూడా 20 పైచిలుకు (22 పరుగులు) ఇవ్వడంతో ముంబై లక్ష్యానికి (12 బంతుల్లో 31 పరుగులు) దగ్గరైంది. 19వ ఓవర్‌లో నవదీప్‌ సైనీ 12 పరుగులిచ్చాడు. ముంబై ఆఖరి 6 బంతుల్లో 19 పరుగులు చేయాల్సి ఉండగా ఉదాన వేసిన ఈ ఓవర్లో ఇషాన్‌ కిషన్‌ 2 సిక్సర్లు కొట్టి ఔట్‌కాగా... ఆఖరి బంతికి 5 పరుగులు అవసరమయ్యాయి. అయితే పొలార్డ్‌ ఫోర్‌ కొట్టడంతో స్కోరు 201తో సమమైంది. మ్యాచ్‌ ‘టై’ అయింది. విజేత కోసం సూపర్‌ ఓవర్‌ ఆడాల్సి వచ్చింది.

సూపర్‌ ఓవర్‌

సూపర్‌ ఓవర్‌లో ముంబై ఇండియన్స్‌ వికెట్‌ కోల్పోయి 7 పరుగులే చేసింది. ముంబై తరఫున హార్దిక్‌ పాండ్యా, పొలార్డ్‌లు ఓపెనింగ్‌కు దిగారు. సైనీ వేసిన సూపర్‌ ఓవర్‌ తొలి బంతికి పొలార్డ్‌ పరుగు తీయగా,రెండో బంతికి పాండ్యా మరో పరుగు సాధించాడు. మూడు బంతికి ఎటువంటి పరుగు రాలేదు. నాల్గో బంతికి పొలార్డ్‌ ఫోర్‌ కొట్టగా, ఐదో బంతికి ఔటయ్యాడు. ఆరో బంతికి బై రూపంలో పరుగు రావడంతో ఆర్సీబీకి ముంబై ఎనిమిది పరుగుల మాత్రమే నిర్దేశించింది. ముంబై తరఫున బుమ్రా సూపర్‌ ఓవర్‌ వేయగా, ఆర్సీబీ తరఫున ఏబీ డివిలియర్స్‌, విరాట్‌ కోహ్లిలు ఓపెనింగ్‌కు వచ్చారు. వీరిద్దరూ చివరి బంతికి ఎనిమిది పరుగులు సాధించడంతో ఆర్సీబీ విజయం ఖాయమైంది. చివరి బంతిని కోహ్లి ఫోర్‌ కొట్టి విజయాన్ని అందించాడు.

స్కోరు వివరాలు

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: దేవ్‌దత్‌ (సి) పొలార్డ్‌ (బి) బౌల్ట్‌ 54; ఫించ్‌ (సి) పొలార్డ్‌ (బి) బౌల్ట్‌ 52; కోహ్లి (సి) రోహిత్‌ శర్మ (బి) రాహుల్‌ చహర్‌ 3; డివిలియర్స్‌ (నాటౌట్‌) 55; శివమ్‌ దూబే (నాటౌట్‌) 27; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 201.

వికెట్ల పతనం: 1–81, 2–92, 3–154.

బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–34–2, ప్యాటిన్సన్‌ 4–0–51–0, చహర్‌ 4–0–31–1, బుమ్రా 4–0–42–0, కృనాల్‌ 3–0–23–0, పొలార్డ్‌ 1–0–13–0.

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి) (సబ్‌) పవన్‌ నేగి (బి) సుందర్‌ 8; డికాక్‌ (సి) (సబ్‌) పవన్‌ నేగి (బి) చహల్‌ 14; సూర్యకుమార్‌ (సి) డివిలియర్స్‌ (బి) ఉదాన 0; ఇషాన్‌ కిషన్‌ (సి) దేవదత్‌ (బి) ఉదాన 99; హార్దిక్‌ (సి) (సబ్‌) పవన్‌ నేగి (బి) జంపా 15; పొలార్డ్‌ (నాటౌట్‌) 60; కృనాల్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 201.

వికెట్ల పతనం: 1–14, 2–16, 3–39, 4–78, 5–197.

బౌలింగ్‌: ఇసురు ఉదాన 4–0–45–2, వాషింగ్టన్‌ సుందర్‌ 4–0–12–1, నవదీప్‌ సైనీ 4–0–43–0, యజువేంద్ర చహల్‌ 4–0–48–1, ఆడమ్‌ జంపా 4–0–53–1.