గతేడాది కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మెల్లగా కోలుకుంటున్న టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆరోగ్యంపై తాజాగా ఓ అప్ డేట్ వచ్చింది. పంత్ పూర్తిగా కోలుకోవడానికి మరో 9 నెలలు పట్టవచ్చని తెలుస్తోంది. అప్పటికి పంత్ కోలుకుంటే చాలా త్వరగా కోలుకున్నట్టేనని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్‌కు, అక్టోబర్, నవంబర్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు పంత్ దూరంగా ఉండాల్సి ఉంటుంది. పంత్ ప్రస్తుతం కర్రల సహాయంతో నడుస్తున్నాడు.
ప్రపంచకప్‌లో పంత్‌కి ప్రత్యామ్నాయం ఎవరు: వన్డే ప్రపంచకప్‌కు పంత్ అందుబాటులో ఉండడని దాదాపుగా తేలిపోయింది. మరి అతడికి ప్రత్యామ్నాయం ఎవరనేది ప్రస్తుతం టీమ్ ఇండియా అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. సెలక్టర్ల పరిశీలనలో పలువురి పేర్లు ఉన్నప్పటికీ ఎవరిని ఖరారు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రపంచకప్‌కు ముందున్న ఆటగాళ్ల ట్రాక్ రికార్డు, ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేయాలని భావిస్తున్నారు. దీంతో పాటు ప్రస్తుత ఐపీఎల్ (2023)లో వివిధ జట్ల వికెట్ కీపర్ల ప్రదర్శనను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
వన్డే ప్రపంచకప్‌లో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లలో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ పేర్లు ఉన్నాయి. ఆ తర్వాత కేఎల్ రాహుల్, శ్రీకర్ భరత్ పేర్లు వినిపిస్తున్నాయి. సెలెక్టర్లు KL రాహుల్‌ని పూర్తి స్థాయి బ్యాట్స్‌మెన్‌గా ఉపయోగించాలని నిర్ణయించుకుంటే, అతని పేరు ఈ జాబితా నుండి తొలగించబడవచ్చు. జితేష్ శర్మ (పంజాబ్), ప్రభ్‌సిమ్రాన్ (పంజాబ్), అభిషేక్ పోరెల్ (ఢిల్లీ), ఎన్ జగదీశన్ (కెకెఆర్)ల పేర్లు రేసులోకి వచ్చాయి. గుజరాత్ ఓపెనర్, వెటరన్ ప్లేయర్ సాహ అవకాశాలను కొట్టిపారేయలేం.
ప్రస్తుత ఫామ్ దృష్ట్యా వన్డే ప్రపంచకప్ కు సాహానే బెటర్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సీజన్‌లో దినేష్ కార్తీక్ పూర్తిగా ఫేడవుట్ కావడంతో అతడిని పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు. వీరితో పాటు యువ వికెట్ కీపర్లు సర్ఫరాజ్ ఖాన్ (ఢిల్లీ), ఉపేంద్ర యాదవ్ (సన్‌రైజర్స్), ధృవ్ జురెల్ (రాజస్థాన్), అనుజ్ రావత్ (ఆర్‌సిబి), విషు వినోద్ (ముంబై) ఐపిఎల్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరి ఎట్టకేలకు సెలక్టర్లు ఎవరిని ఖరారు చేస్తారో వేచి చూడాలి