ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) భాగంగా ఈ రోజు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 84 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 13.3 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా సఫారీ బౌలర్లు (South Africa Bowlers Shine) విజృంభించడంతో 84 పరుగులకే ఆలౌట్ అయింది. 85 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన సౌతాఫ్రికా కూడా తొలి ఓవర్లోనే ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (4) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే ఫామ్‌లో ఉన్న ఎయిడెన్ మార్క్రమ్ (0), డి కాక్ (16) కూడా అవుటవడంతో మ్యాచ్ (South Africa vs Bangladesh) నువ్వా నేనా అన్నట్లు సాగుతుందనిపించింది. అయితే వాన్ డర్ డస్సెన్ (22) తో కలిసి వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసిన కెప్టెన్ టెంబా బవుమా (31 నాటౌట్) జట్టును విజయం వైపు నడిపించాడు.
జట్టు స్కోరు 80 పరుగుల వద్ద వాన్ డర్ డస్సెన్ కూడా అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ (5 నాటౌట్) ఫోర్‌తో జట్టుకు విజయాన్నందించాడు. ఈ క్రమంలో 13.3 ఓవర్లలోనే టార్గెట్ ఛేజ్ చేసిన సౌతాఫ్రికా మరో 39 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2, నాసుమ్ అహ్మద్ 1, మెహదీ హసన్ 1 వికెట్ పడగొట్టారు.
ఈ విజయంతో దక్షిణాఫ్రికా ఆరు పాయింట్లతో గ్రూప్ 1లో రెండో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు, ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓటమి పాలైన బంగ్లాదేశ్ సెమీఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. అలాగే, నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడింటిలో ఓడిన శ్రీలంక కూడా సెమీస్ రేసు నుంచి అవుటైంది.