David Miller (Photo Credits: Twitter)

శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో (SA vs SL Highlights of T20 World Cup 2021) దక్షిణాఫ్రికానే విజయం వరించింది. శ్రీలంకకు విజయం అందినట్టే అంది చేజారింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ వరుస సిక్సర్లు బాది (David Miller Snatches Win For South Africa) జట్టుకు సూపర్ విక్టరీ అందించాడు.

143 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఒకానొక దశలో ఓటమి దిశగా పయనిస్తున్నట్టు కనిపించింది. 17.1 ఓవర్ వద్ద కెప్టెన్ తెంబా బవుమా (46), ఆ తర్వాతి బంతికే ప్రెటోరియస్ (0) అవుటైన తర్వాత శ్రీలంక విజయం ఖాయమేనని అనుకున్నారు. అయితే, క్రీజులో ఉన్న డేవిడ్ మిల్లర్ చిచ్చరపిడుగల్లే చెలరేగిపోయాడు. అతడికి రబడ సహకారం అందించడంతో సఫారీ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

తొలుత లంక స్పిన్నర్‌ హసరంగ(3/20) హ్యాట్రిక్‌ సాధించడంతో మ్యాచ్‌ లంక వైపు మొగ్గుచూపగా.. ఆఖర్లో మిల్లర్‌(13 బంతుల్లో 23; 2 సిక్సర్లు) కిల్లర్‌ ఇన్నింగ్స్‌ ఆడడంతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దక్షిణాఫ్రికా విజయానికి ఆఖరి ఓవర్‌లో 15 పరుగులు అవసరం కాగా.. మిల్లర్‌ వరుస సిక్సర్లు బాది జట్టును గెలిపించాడు. అతనికి రబాడ(7 బంతుల్లో 13; ఫోర్‌, సిక్స్‌) సహకరించడంతో మరో బంతి మిగిలుండగానే దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సఫారి కెప్టెన్‌ బవుమా(46 బంతుల్లో 46; ఫోర్‌, సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. లంక బౌలర్లలో హసరంగతో పాటు చమీరా(2/27) రాణించాడు.

లంకను చిత్తు చేసిన ఆస్ట్రేలియా, వార్నర్ దూకుడుతో చేతులెత్తేసి శ్రీలంక

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 142 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ పాతుమ్ నిశంక 72, అసలంక 21 పరుగులు చేశారు. సఫారీ బౌలర్లలో షంషీ, ప్రిటోరియస్ చెరో మూడు వికెట్లు తీసుకోగా, అన్రిక్ నార్జ్ రెండు వికెట్లు పడగొట్టాడు. నాలుగు ఓవర్లు వేసి 17 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టిన షంషీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. దీంతో గ్రూప్‌-1లో ఆడిన మూడు మ్యాచుల్లో దక్షిణాఫ్రికా రెండు విజయాలు నమోదు చేయగా, శ్రీలంక మాత్రం మూడింట రెండు ఓటములను చవిచూసింది. లంక బౌలర్లలో హసరంగ 3, చమీర 2 వికెట్లు పడగొట్టారు.