Sachin Gully Cricket in Kashmir: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం కాశ్మీర్ పర్యటనలో ఉన్నాడు. తన జీవితంలో తొలిసారి కాశ్మీర్ వెళ్లిన సచిన్ అక్కడి అందాలను చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నాడు. ఇంతకంటే గొప్ప స్వర్గం ఏది ఉండదని చెబుతున్నాడు. తన పర్యటనను ఆసాంతం ఆస్వాదిస్తున్న క్రికెట్ గాడ్, అక్కడి విశేషాలను సోషల్ మీడియా ద్వారా ఒక్కొక్కటిగా పంచుకుంటున్నాడు. విమానం నుండి కనిపించే మంచుతో కప్పబడిన హిమాలయా శిఖరాలు కావచ్చు, తాను ప్రయాణించిన కఠినమైన మంచు దారులు కావొచ్చు, అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం కావచ్చు ఇలా అందాల కాశ్మీర్‌లోని ప్రతీ అంశం సచిన్‌ను మంత్రముగ్ధుడ్ని చేస్తుంది.
తాజాగా గుల్మార్గ్ పటణంలో స్థానిక యువకులతో కలిసి సచిన్ గల్లీ క్రికెట్ ఆడాడు. వారితో కాసేపు సరదాగా గడిపాడు. దీంతో అక్కడి పిల్లలకు సచిన్ ఆటను నేరుగా చూడటమే కాదు, ఆయనతో క్రికెట్ ఆడే అదృష్టమూ దక్కింది. ఖాళీ రోడ్డుపై అక్కడ యువకులు బౌలింగ్ వేయగా, మాస్టర్ బ్లాస్టర్ బ్యాటింగ్ చేశాడు. 'చాలా మంచి బంతి వేశావు.. చాలా మంచి క్యాచ్ పట్టావు' అంటూ సచిన్ వారిని ఉత్సాహపరిచాడు కూడా. చుట్టుపక్కల వారు అంతా గుమిగూడి సచిన్ ఆటను నేరుగా చూస్తూ ఆస్వాదించారు. కశ్మీర్‌లో యువకులతో సచిన్ గల్లీ క్రికెట్ ఆడుతున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియోను మీరూ చూసేయండి..
Sachin Tendulkar Plays Gully Cricket With Kashmir Youngsters
Cricket & Kashmir: A MATCH in HEAVEN! pic.twitter.com/rAG9z5tkJV
— Sachin Tendulkar (@sachin_rt) February 22, 2024
అంతకుముందు రోజు, సచిన్ స్థానికంగా ఉన్న బ్యాట్ల తయారీ ఫ్యాక్టరీ MJ స్పోర్ట్స్ ని సందర్శించాడు. ఈ సందర్భంగా చిన్నప్పుడు తన సోదరి నుంచి బహుమతిగా పొందిన తన మొదటి కాశ్మీర్ విల్లో బ్యాట్‌ను సచిన్ గుర్తుచేసుకున్నాడు.
అంతేకాకుండా ఈ పర్యటనలో భాగంగా జమ్మూ- కాశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లోని నియంత్రణ రేఖపై చివరి పాయింట్ అయిన అమన్ సేతు వంతెనను కూడా టెండూల్కర్ సందర్శించారు. అక్కడ ఒక గంటపాటు గడిపిన సచిన్ అమన్ సేతు సమీపంలోని కమాన్ పోస్ట్ వద్ద భారత సైనికులతో సంభాషించారని అధికారులు తెలిపారు.