NZ vs IND 4th T20I: మన మ్యాచ్ అవ్వాలి మళ్ళీ మళ్ళీ 'టై', న్యూజిలాండ్ - భారత్ నాలుగో టీ20 కూడా టై, సూపర్ ఓవర్లో మళ్లీ టీమిండియాదే గెలుపు!
Shardul Thakur and Virat Kohli (Photo Credits: Getty)

'ఎందుకో మాకూ ఈ 'టై' మ్యాచ్‌లు అచ్చిరావు. మంచి ప్రదర్శన చేసి గెలుపు పక్షంగా ఉండాల్సిన మేము, ఓటమి పక్షంలో ఉండాల్సి రావడం దురదృష్టం' - మూడో టీ20 టై అయి, సూపర్ ఓవర్లో టీమిండియా గెలిచిన తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫ్రస్ట్రేషన్ ఇది. అన్నట్లే మరోసారి 'టై' మ్యాచ్ ఆ జట్టుకు అచ్చి రాలేదు.

న్యూజిలాండ్ - భారత్ మధ్య జరిగిన నాలుగో టీ20  కూడా టై (NZ vs IND 4th T20I Tie) గా ముగిసింది. అయితే మూడో మ్యాచ్‌లో గెలిపించిన రోహిత్ శర్మ, మహ్మద్ షమీలు ఈ మ్యాచ్‌లో ఆడలేదు. అయినా కూడా శార్దూల్ ఠాకూర్, కేఎల్ రాహుల్, కెప్టెన్ విరాట్ కోహ్లీ మరియు జటు అంతా కలిసి సమిష్టిగా టీమిండియాను గెలిపించారు. ఈ దెబ్బతో కివీస్‌కు ఫ్రస్ట్రేషన్, భారత్‌కు ఫన్.

శార్దూల్ ఠాకూర్ మాయాజాలం, చివరి ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టిన భారత్: తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ధిష్ఠ 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. హైఎస్ట్ స్కోర్ మనీష్ పాండే 50. ఇక 166 పరుగుల విజయ లక్ష్యంతో ఛేజింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జాగ్రత్తగా ఆడుతూ, సునాయసంగానే లక్ష్యానికి చేరువయ్యింది. 19 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్ 159/3, అంటే విజయానికి ఆరు బంతుల్లో కేవలం 7 పరుగులే చేయాల్సింది. టీ20లో ఒక సిక్సర్ చాలు. న్యూజిలాండ్ కూడా అదే ధీమాతో  ఉంది. చేతిలో వికెట్లు, మంచి బ్యాట్స్ మెన్ క్రీజులో ఉన్నారు. కానీ, ఆ చివరి ఓవరే వారికి పీడకలను మిగిలిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.

చివరి ఓవర్ వేసేది శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur).

1st Ball - రాస్ టేలర్ లేపాడు, బాల్ చందమాను తాకి నేరుగా మిడ్ వికెట్ దిశగా ఫీల్డర్ శ్రేయాస్ అయ్యర్ చేతిలో పడింది. ఔట్!! భారత్ వైపు హర్షధ్వనాలు, కివీస్ వైపు, హా.. ఒక్కటేగా అనే ధీమా. 5 బంతుల్లో ఇంకా 7 పరుగులు చేయాలి.

2nd Ball - 4, ఇదెలా ఉంది శార్దూల్ అంటూ రెండో బాల్ మిచెల్ ఫోర్ కొట్టాడు. 4 బంతుల్లో 3 పరుగులు

3rd Ball - రనౌట్, బాల్ బ్యాటుకు తగలక పోయినా మిచెల్ రన్ కు ప్రయత్నించాడు, రెండో వైపులో ఉన్న సీఫర్ట్ రనౌట్ అయ్యాడు. 3 బంతుల్లో 3 పరుగులు.

4th Ball - 1 రన్ వచ్చింది. 2 బంతుల్లో 2 పరుగులు అవసరం.

5th Ball - ఔట్, బాగా టెన్షన్ పడ్డ మిచెల్ గాల్లోకి లేపి క్యాచ్ ఇచ్చాడు, పరుగులేం రాలేదు. 1 బంతిలో 2 పరుగులు అవసరం.

6th Ball - చిట్ట చివరి బంతి- సాంట్నర్ 1 రన్, ఇంకో రన్ తీసేందుకు యత్నం కానీ ఔట్, రనౌట్. ఒక్కటే. స్కోర్స్ లెవెల్, మళ్ళీ మ్యాచ్ టై, మళ్లీ సూపర్ ఓవర్ (Super Over).

గెలవాల్సిన మ్యాచ్ ను న్యూజిలాండ్ మళ్ళీ భారత్ చేతిలో పెట్టింది. చివరి ఓవర్లో మాయాజాలం చేసిన శార్దూల్ ఠాకూర్ కే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఖరారైంది.

ఇక సూపర్ ఓవర్ క్లుప్తంగా.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు, బూమ్రా బౌలింగ్ 12 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. భారత్ విజయ లక్ష్యం ఒక ఓవర్లో 13 పరుగులు, గరిష్ఠంగా ఒక వికెట్ పడాలి.

కేఎల్ రాహుల్ బ్యాటింగ్- టిమ్ సౌథీ బౌలింగ్,  1st Ball యార్కర్ వేసే ప్రయత్నం చేశాడు. ఏంటీ నాకే బ్యాట్ కింద బాల్ వేస్తావా? జోకా? అయితే ఇదిగో తీసుకో అంటూ రాహుల్ లేపి కొడితే, స్ట్రైట్ సిక్సర్!! 5 బంతుల్లో 7 పరుగులు అవసరం.

2nd Ball , స్లో బౌన్సర్- రాహుల్ తిరిగి కొడితే, ఆన్ సైడ్లో ఫోర్!! 4 బంతుల్లో 3 పరుగులు.

3rd Ball , లోపలికి వచ్చింది. మళ్ళీ రాహుల్ లేపి కొడితే బౌండరీ వద్ద ఫీల్డర్ కి క్యాచ్!! 3 బంతుల్లో 3 పరుగులు.

4th Ball , కెప్టెన్ విరాట్ కోహ్లీ నిదానమే ప్రధానం. 1 రన్ తీశాడు, అటు ఇటూ చూసి రెండో రన్ కూడా చాకచక్యంగా పూర్తి చేశాడు. 2 బంతుల్లో 1 పరుగు చాలు.

5th Ball - విరాట్ కోహ్లీ గేర్ మార్చాడు. లాంగ్ ఆన్ దిశగా 4. భారత్ వరుసగా రెండో సూపర్ ఓవర్ మ్యాచ్ లోనూ విజయం, వరుసగా నాలుగో టీ20లోనూ కొనసాగిన జైత్రయాత్ర. ఇక ఈ సిరీస్ లో మిగిలిన చివరి టీ20, ఎల్లుండి, ఈ ఆదివారం జరుగుతుంది. ఆ మ్యాచ్ కూడా టై అయితే, న్యూజిలాండ్ కి భారత్ మూడు ముళ్లు వేసినట్లే!