Team India XI: ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు తుది జట్టును ప్రకటించిన బీసీసీఐ.. గిల్, పంత్, కేఎల్ రాహుల్‌లకు దక్కని చోటు, డిసెంబర్ 17 నుంచి పింక్ బాల్‌తో డే అండ్ నైట్ టెస్ట్‌తో సిరీస్ ప్రారంభం
File Image | Indian Cricket Team | (Photo Credits: Getty Images)

డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్టుకు భారత జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ గురువారం నుంచి అడిలైడ్ వేదికగా పింక్ బాల్‌తో జరిగే 'డే అండ్ నైట్' టెస్ట్ మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది.

తొలి టెస్ట్ మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ సారథ్యం వహించనున్నాడు. కోహ్లీ తన భార్య అనుష్క శర్మ ప్రెగ్నెన్సీ నేపథ్యంలో స్వదేశం పయనం కానున్నాడు. తర్వాతి 3 మ్యాచ్‌లకు వైస్ కెప్టెన్ అజింక్యా రహానే సారథ్యం వహించనున్నాడు.

తుది జట్టులో ఒపెనర్లుగా మయాంక్ అగర్వాల్‌, పృథ్వీ షా చోటు సంపాదించగా, రిషబ్ పంత్‌ను వెనక్కి నెట్టి వృద్దిమాన్ సాహా వికెట్ కీపర్ స్లాట్‌ను దక్కించుకున్నాడు. కాగా, పృథ్వీ షా ఎంపిక క్రీడా విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది. వార్మప్ మ్యాచ్ లలో పృథ్వీ దారుణంగా విఫలమయ్యాడు. ఆడిన 4 ఇన్నింగ్స్‌లలో పృథ్వీ 0, 19, 40 మరియు 3 స్కోర్‌లను నమోదు చేశాడు. మరోవైపు శుభమన్ గిల్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ లు రాణించినా, తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు.

Here's India's Playing XI!!

ఇక, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ లను వెనక్కి నెట్టి రవిచంద్రన్ అశ్విన్ స్పిన్నర్ కోటాలో ఎంపికయ్యాడు, హనుమా విహారీ మిడిలార్డర్లో తన స్థానాన్ని నిలుపుకున్నాడు. సందర్భాన్ని బట్టి రెండో స్పిన్నర్ గా విహారీని ఉపయోగించుకోవచు.

బౌలింగ్ విభాగంలో మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్ స్థానం నిలుపుకున్నారు.