IND-vs-SL | Photo: Twitter

Colombo, July 29: బుధవారం జరిగిన రెండో ట్వంటీ 20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లో భారత్ పై శ్రీలంక 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. పిచ్ స్లోగా ఉండటంతో పరుగులు ఎక్కువగా రాలేదు. ఇందులో 42 బంతుల్లో 40 పరుగులతో కెప్టెన్ శిఖర్ ధవన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఇక 133 పరుగుల బరిలోకి దిగిన శ్రీలంక, ఆ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు చెమటోడ్చింది. చివరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్ లో ఎట్టకేలకు శ్రీలందే పైచేయిగా నిలిచింది. 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసిన శ్రీలంక విజయం సాధించింది. లంక బ్యాట్స్ మెన్ లో ధనుంజయ డి సిల్వ 34 బంతుల్లో 40 పరుగులతో నాటౌట్ గా చివరి వరకు ఉండి జట్టును గెలిపించాడు. ఇతడికే 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డ్ దక్కింది.

పరుగులు అతి కష్టంగా వస్తున్న పిచ్ పై చివరి వరకు కూడా ఈ మ్యాచ్ పై భారత్ పట్టు సాధిస్తూ వచ్చింది. శ్రీలంకకు 10 బంతుల్లో 18 పరుగులు కావాల్సిన సమయంలో టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఒక ఫుల్ టాస్ వేశాడు, దీంతో టెయిలెండర్ కరుణరత్నే నేరుగా దానిని సిక్స్ గా మలిచాడు. ఇక్కడితో స్కోర్ అమాంతం తగ్గిపోయింది, అప్పటివరకు భారత్ చేతిలో ఉన్న మ్యాచ్ ఒక్కసారిగా శ్రీలంక వైపు మొగ్గింది.

ఇక, తొలి మ్యాచ్ గెలిచిన భారత్ రెండో మ్యాచ్ లో పరాజయం పాలవడంతో సిరీస్ 1-1తో సమం అయింది. ఈరోజు రాత్రి 8 గంటల నుంచి నిర్ణయాత్మక చివరి టీ20 మ్యాచ్ జరగనుంది.

ఇక ఈ రెండో టీ20 మ్యాచ్ మంగళవారమే జరగాల్సి ఉండగా భారత జట్టులో క్రునాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ అని తేలడంతో మ్యాచ్ బుధవారానికి రీషెడ్యూల్ చేశారు. క్రునాల్ పాండ్యాతో సన్నిహితంగా ఉన్నందున ఎనిమిది మంది ఆటగాళ్ళు ఆట నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత దేవదత్ పాడికల్, రుతురాజ్ గైక్వాడ్, నితీష్ రానా మరియు చేతన్ సకారియాలను కొత్తగా జట్టులోకి తీసుకున్నారు. ఏదైమైనా శ్రీలంక పర్యటనకు ఎంపిక కాబడిన 9 మంది భారత ఆటగాళ్లు ఐసోలేషన్ లోకి వెళ్లడంతో మిగిలిన ఆటగాళ్లలతోనే టీమిండియా నెట్టుకొచ్చి, రెండో టీ20లో గట్టిపోటీని ఇచ్చింది. దీంతో భారత్ మ్యాచ్ ఓడినప్పటికీ యువ జట్టు పోరాటపటిమకు ప్రశంసలు దక్కాయి.