Kane Williamson & Jason Holder. | (Photo Credit: Twitter/IPL)

చివరి ఓవర్ వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ లో హైదరాబాద్ సూపర్ విక్టరీ కొట్టింది. అబుదాబి వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 ఎలిమినేటర్ మ్యాచ్ లో ప్రత్యర్థి బెంగళూరు జట్టును 6 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. ఈ గెలుపుతో SRH ఫైనల్ బెర్త్ కోసం జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్ ఆడనుండగా, ఓటమితో RCB జట్టు మాత్రం ఐపీఎల్2020 నుంచి నిష్క్రమించింది.

శుక్రవారం కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 131 పరుగులే చేసింది. ఈ మ్యాచ్ లో ఆశ్చర్యకరంగా ఒపెనర్ గా వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు6 పరుగులకే క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. మరో ఒపెనర్ దేవదత్ పడిక్కల్ కూడా 1 పరుగుకే ఔట్ అయ్యి నిరాశపరిచాడు. 15 పరుగులకే 2 కీలక వికెట్లు పోగొట్టుకున్న సమయంలో ఆరోన్ ఫించ్ 30 బంతుల్లో 32, డివిలియర్స్ 43 బంతుల్లో 56 పరుగులతో ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. వీరు తప్ప RCB జట్టులో మిగతా బ్యాట్స్ మెన్ ఎవ్వరూకూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు.

అనంతరం 132 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన SRH జట్టు కూడా తడబడింది. ఒపెనర్ గోస్వామి సిరాజ్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి డకౌట్ గా వెనుదిరగగా, మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ఈ మ్యాచ్ లో 17 పరుగులకే ఔట్ అయ్యాడు. RCB బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో హైదరాబాద్ జట్టు జాగ్రత్తగా ఆడింది. SRH మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ కేన్ విలియమ్సన్, ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ తో కలిసి విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. విలియమ్సన్ 44 బంతుల్లో 50, హోల్డర్ 20 బంతుల్లో 24 పరుగులతో ఇన్నింగ్స్ చివరి వరకు ఉండి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్ చివరి ఓవర్ వరకు గెలుపు ఎవరనేది చెప్పలేనంతగా ఉత్కంఠంగా సాగింది. చివరి ఓవర్లో SRHకు 9 పరుగులు అవసరమవ్వగా తొలి 2 బంతులకు 1 పరుగు మాత్రమే వచ్చింది. 4 బంతుల్లో 8 పరుగులు అవసరమైన సమయంలో జేసన్ హోల్డర్ కొట్టిన 2 షాట్లు ఫోర్లుగా వెళ్లడంతో SRH లక్ష్యాన్ని ఛేదించేసింది. ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫైయర్ 2లోకి ఎంటర్ అయింది. ఫైనల్ బెర్త్ కోసం జరిగే ఈ పోరులో SRH జట్టు దిల్లీ క్యాపిటల్స్ తో ఈ ఆదివారం తలపడనుంది. దీంట్లో గెలిచిన జట్టు ముంబైతో ఫైనల్ ఆడనుంది.

ఇక ఐపీఎల్ సీజన్ మొఅదలయ్యే ప్రతీసారి 'ఈసాల కప్ నందే' అంటూ బరిలోకి దిగే రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు దురదృష్టం ఇంకా వెంటాడుతోంది. ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ ట్రోఫీ గెలవని ఆ జట్టుకు ఈ ఏడాది కూడా ఐపీఎల్ కప్ అందని ద్రాక్షే అయ్యింది. ఉత్త చేతులతోనే RCB జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.