హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న అజారుద్దీన్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. అజర్ నేతృత్వం వహిస్తున్న హెచ్‌సీఏ కమిటీని రద్దు చేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం మంగళవారం తీర్పునిచ్చింది. ప్రస్తుత కమిటీ స్థానంలో మాజీ జడ్జి లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు వెల్లడించింది.
ఇకపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాలను ఏకసభ్య కమిటీ చూసుకుంటందని తెలిపింది.త్వరలోనే హెచ్‌సీఏకు ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ రూపొందించే నివేదికను పరిశీలించిన తర్వాత, తమ తదుపరి చర్యలు ఉంటాయని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది.
ఒకప్పుడు అజహరుద్దీన్, ఎంఎల్ జయసింహ, వీవీఎస్ లక్ష్మణ్, వెంకటపతిరాజు వంటి ప్రఖ్యాత క్రికెటర్లను అందించిన హైదరాబాద్ సంఘం అంతర్గత కుమ్ములాటలతో క్రికెట్ వ్యవహారాలను పక్కనబెట్టిందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. జట్టు ఎంపికలోనూ రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.