1983 World Cup Memories: అంచనాలు లేకుండానే విశ్వవిజేత, భారత్ తొలి ప్రపంచకప్ సాధించి నేటితో 37 ఏళ్లు, ఈ తీపి గుర్తులపై స్పెషల్ స్టోరీ
Kapil Dev With 1983 World Cup Title (Photo Credits: Twitter/ ICC)

హాకీతో దూసుకుపోతున్న భారత్ ప్రజానీకాన్ని క్రికెట్ బాట పట్టించిన రోజు నేడు. ప్రపంచ యవనికపై ప్రపంచ కప్ ను (1983 Cricket World Cup) అందుకుని నేటికి 37 ఏళ్లు. ఎటువంటి అంచనాల్లేకుండా బరిలోకి దిగిన భారత్ మహామహులను మట్టి కరిపించి విశ్వ విజేతగా (1983 World Cup) మారిన రోజు నేడు. ఆర వీర భయంకరులను ఓడించి క్రికెట్‌కు పుట్టినిల్లయిన లార్డ్స్‌లో సగర్వంగా ప్రపంచకప్‌ను ముద్దాడిన భారత జట్టు అందించిన మధురస్మృతులు నాలుగు దశాబ్దాలు దాటినా ఇంకా అభిమానుల గుండెల్లో అలాగే ఉన్నాయి.

ఎలాంటి అంచనాలు లేకుండానే ఇంగ్లండ్‌ గడ్డపై అడుగుపెట్టిన కపిల్‌ సేన అద్భుతమైన ఆటతీరుతో 17 రోజుల్లో చరిత్రను తిరగరాసి జగజ్జేతగా నిలిచింది. ఆ విజయంతోనే దేశంలో క్రికెట్‌ దశ మారి యువతను హాకీ స్టిక్‌ వదిలేసి క్రికెట్‌ బ్యాట్‌ వైపు మళ్లేలా చేసింది. ఆ మధుర క్షణాలను ఓ సారి గుర్తు చేసుకుంటే.. తడబడిన ఇండియా, మరోసారి చాంఫియన్‌గా అవతరించిన ఆస్ట్రేలియా, మొత్తం 5 సార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టుగా రికార్డు

Here's KapilDev defeated West Indies Video

1975లో జరిగిన తొలి ప్రపంచకప్‌లో భారత్‌ 3 మ్యాచ్‌లలో ఒకటే, అదీ ఎవరూ పట్టించుకోని ఈస్ట్‌ ఆఫ్రికాపై గెలిచింది. ఆ తరువాత 1979లో జరిగిన రెండో ప్రపంచకప్‌లో ఆ విజయం కూడా దక్కకుండా ఇంటి బాట పట్టింది. వరల్డ్‌కప్‌లు మినహాయించి అప్పటి వరకు కేవలం 10 వన్డే సిరీస్‌లే ఆడిన భారత్‌ సొంతగడ్డపై 2 మాత్రమే గెలిచి, మిగతా 8 ఓడింది. ఇలాంటి నేపథ్యంతో బరిలోకి దిగిన 1983 ప్రపంచకప్‌లో అడుగుపెట్టింది.

Watch Highlights: ..

కపిల్‌దేవ్‌ బృందంపై ఎలాంటి అంచనాలు లేవు. అయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారనే సామెతనే నిజం చేస్తూ, అందరి లెక్కలను తలకిందులు చేస్తూ తుదిపోరుకు భారత్‌ అర్హత సాధించింది. అప్పటికే రెండుసార్లు ప్రపంచకప్‌ నెగ్గి జోరుమీదున్న వెస్టిండీస్‌తో (India vs West Indies) భారత జట్టు తొలి మ్యాచ్‌ ఆడాల్సి వచ్చింది. మైదానంలో దిగాక కపిల్‌ డెవిల్స్‌ విశ్వరూపం ప్రదర్శించింది. అప్పటి వరకు తూర్పుఆఫ్రికా వంటి చిన్న జట్టుపై తప్ప ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా నెగ్గని భారత్‌.. వెస్టిండీస్‌పై ఘనవిజయం సాధించడం మన జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.

Here's Kirti Azad Tweet

అదే ఊపులో రెండో మ్యాచ్‌లో జింబాబ్వేను ఓడించిన కపిల్‌ సేన తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ చేతిలో ఘోర పరాజయం పాలైంది. అయినా వెరవక ఆ తరువాత జింబాబ్వేపై అద్భుత విజయం సాధించింది. 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన జట్టును కపిల్‌ దేవ్‌ (138 బంతుల్లో 175 నాటౌట్‌; 16 ఫోర్లు, 6 సిక్సర్లు) ఒంటి చేత్తో ఒడ్డున పడేశాడు. ఆ గెలుపుతో స్ఫూర్తి పొందిన భారత్‌.. చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను చిత్తుచేసి సెమీఫైనల్లో అడుగుపెట్టింది.

సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి తొలిసారి ఫైనల్‌ (1983 World Cup final) చేరిన టీమ్‌ఇండియా.. జూన్‌ 25న జరిగిన ఫైనల్లో అద్భుతాన్ని ఆవిష్కరించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కపిల్‌ సేన.. ప్రత్యర్థి ముందు స్వల్ప లక్ష్యాన్నే ఉంచినా.. స్ఫూర్తిదాయక బౌలింగ్‌కు తోడు కపిల్‌ ఫీల్డింగ్‌ విన్యాసాలతో విశ్వవిజేతగా నిలిచింది. విండీస్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌ ఇచ్చిన క్యాచ్‌ను దాదాపు 20 అడుగుల దూరం వెనక్కి పరిగెడుతూ కపిల్‌ దేవ్‌ అందుకోవడంతో స్టేడియం మారుమోగిపోయింది.

ముందుగా బ్యాటింగ్‌ చేసి 183 పరుగులకే కుప్పకూలడంతో ఇక ఆశలు లేకపోయాయి. కానీ కపిల్‌ డెవిల్స్‌ మాత్రం తమపై నమ్మకం కోల్పోలేదు. తమ సర్వశక్తులూ ఒడ్డి వెస్టిండీస్‌ జట్టును 140 పరుగులకే ఆలౌట్‌ చేసింది. 43 పరుగుల తేడాతో మ్యాచ్‌ గెలిచి విశ్వవిజేతగా నిలిచిన క్షణాన లార్డ్స్‌ మైదానం భారత అభిమానుల హోరుతో ఊగిపోయింది. ప్రపంచ క్రికెట్‌పై భారత్‌ ముద్ర పడిన ఆ క్షణం ఎప్పటికీ మరచిపోలేని మధుర ఘట్టంగా మిగిలిపోయింది.

ఆనాటి జట్టులో సభ్యులు

Kapil Dev (Captain), Sunil Gavaskar, Mohinder Amarnath, Sandeep Patil, Krishnamachari Srikkanth, Roger Binny, Madan Lal, Kirti Azad, Yashpal Sharma, Syed Kirmani (wicketkeeper), Balwinder Singh Sandhu