టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించాడు. యూఏఈ, ఒమన్ వేదికగా జరుగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీకి వీడ్కోలు పలకనున్నట్లు (Virat Kohli To Step Down As T20I Captain) తెలిపాడు. ఈ విషయం గురించి బీసీసీఐ కార్యదర్శి జై షా, అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నాడు. అయితే వన్డే, టెస్టుల్లో మాత్రం కెప్టెన్‌గా కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఈ మేరకు కోహ్లి ట్విటర్ వేదికగా ఓ లేఖను (Cricketer Makes Announcement on Twitter) విడుదల చేశాడు.
టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడమే కాకుండా.. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నాను. సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, సెలక్షన్ కమిటీ, నా కోచ్‌లు, ప్రతీ భారతీయుడికి కృతజ్ఞతలు. మీ మద్దతు లేకుండా ఇదంతా సాధ్యమయ్యేదే కాదు. 8-9 ఏళ్లుగా మూడు ఫార్మాట్లలో ఆడుతుండటం, గత 5-6 ఏళ్లుగా కెప్టెన్సీ కారణంగా వర్క్‌లోడ్ ఎక్కువైంది. కాస్త విశ్రాంతి కోరుకుంటున్నా. వన్డే, టెస్టు కెప్టెన్సీపై దృష్టి సారించాలనుకుంటున్నాను. టీ20 కెప్టెన్‌గా నా బెస్ట్ ఇచ్చాను. ఇకపై బ్యాట్స్‌మెన్‌గా కూడా అదే తరహా ప్రదర్శనతో ముందుకు సాగుతాను.
🇮🇳 ❤️ pic.twitter.com/Ds7okjhj9J
— Virat Kohli (@imVkohli) September 16, 2021
నిజానికి చాలా రోజుల కిందటే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా సన్నిహితులతో చర్చించాను. లీడర్‌షిప్ గ్రూపులో కీలకమైన రవి భాయ్, రోహిత్‌తో కూడా మాట్లాడాను. అందుకే దుబాయ్‌లో అక్టోబరులో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతా. ఈ విషయం గురించి సెక్రటరీ జై షా, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో మాట్లాడాను. వన్డే, టెస్టు కెప్టెన్‌గా నా శక్తిమేర జట్టును ముందుకు నడిపిస్తాను’’ అని కోహ్లి (Virat Kohli) పేర్కొన్నాడు.
కాగా కోహ్లి నిర్ణయంతో వైఎస్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌లో సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన హిట్‌మ్యాన్‌కు టీమిండియా టీ20 కెప్టెన్సీ దక్కడం లాంఛనమే కానుంది. ఇందుకు సంబంధించి బీసీసీఐ నుంచి అధికారికి ప్రకటన వెలువడాల్సి ఉంది.
ధోని రాజీనామాతో జనవరి 26, 2017న తొలిసారి టి20 మ్యాచ్‌లో భారత్‌కు కోహ్లి కెప్టెన్ గా వ్యవహరించగా... ఇప్పటి వరకు తన 90 అంతర్జాతీయ మ్యాచ్‌లలో సగం మ్యాచ్‌లు (45) అతను సారథిగా మైదానంలోకి దిగాడు. కోహ్లి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచి ఇప్పటి వరకు భారత్ 67 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 22 మ్యాచ్‌లకు దూరంగా ఉన్న అతను మధ్య మధ్యలో విరామం తీసుకుంటూ 45 మ్యాచ్‌లే ఆడాడు. 45 మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరిస్తే 27 గెలిచి, 14 ఓడిపోగా, మరో 2 మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి.