Chennai, April 9: ప్రపంచంలోనే అత్యంత ధనికమైన, అత్యంత విజయవంతమైన క్రికెట్ ఉత్సవం ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క 14వ ఎడిషన్ శుక్రవారం ప్రారంభం కాబోతుంది. సాధారణంగా కొత్త ఐపిఎల్ సీజన్ మొదలయ్యే ముందు ప్రారంభ వేడుకలు అట్టహాసంగా నిర్వహించబడతాయి. ఐపీఎల్ నిర్వహించటం ఒక ఎత్తైతే, దాని ప్రారంభ వేడుకలు మరో ఎత్తు అనే స్థాయిలో హంగామా ఉంటుంది. అయితే దేశంలో విస్తరిస్తున్న కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఈసారి అలాంటి ఆడంబరాలు లేకుండానే సాధారణంగానే మ్యాచులు ప్రారంభం కానున్నాయి. పెరుగుతున్న కోవిడ్ -19 కేసులు మరియు బయో-సేఫ్టీ ఎన్విరాన్మెంట్ భద్రత నేపథ్యంలో టోర్నమెంట్ కొనసాగడంపై నీలి మేఘాలు కూడా అలుముకుంటున్నాయి.
ఏదైమైనా, ఐపీఎల్ 14 ఎడిషన్ ప్రారంభానికి మాత్రం అంతా సిద్ధమైంది. శుక్రవారం చెన్నై వేదికగా తొలి మ్యాచ్ సాయంత్రం 7:30 నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ లో ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్స్ విజేతగా నిలిచి, హ్యాట్రిక్ పై కన్నేసిన ముంబై ఇండియన్స్ మరియు ఇంతవరకూ ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలుచుకోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.
ఐపీఎల్ 2021 ప్రారంభోత్సవం మరియు మ్యాచ్ వివరాలు
ఏప్రిల్ 9, 2021, శుక్రవారం, భారతదేశంలో జరుగుతుంది.
సమయం 07:30 PM నుంచి ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
మ్యాచ్ జరిగే వేదిక - చెన్నై
ఐపీఎల్ 2021, 14వ ఎడిషన్ యొక్క పూర్తి షెడ్యూల్ :
COVID-19 నేపథ్యంలో ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని నిర్ణయం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ పరిస్థితులు మెరుగుపడితే పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించాలని భావిస్తున్నారు. 14వ సీజన్‌లో భారత ఆటగాళ్లతో పాటు ఎనిమిది వేర్వేరు దేశాల ఆటగాళ్లు కూడా ప్రాతినిధ్యం వహించనున్నారు.
సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొత్తం 8 జట్లు 14వ ఎడిషన్ టైటిల్ కోసం తమ వ్యూహాలతో సిద్ధంగా ఉన్నాయి.
అంతేకాకుండా ఈసారి చాలా ఐపీఎల్ మ్యాచ్ లకు కొత్తగా ప్రారంభమైన గుజరాత్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది.