చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌నే విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్ గ్రూప్-1లో భాగంగా బంగ్లాదేశ్, వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ (T20 West Indies vs Bangladesh) ముగిసింది. చివరి బంతి వరకూ విజయం ఎవరిదో తేల్చలేని స్థితిలో జరిగిన ఈ మ్యాచ్‌లో చివరి బంతికి వెస్టిండీస్ విజయం (West Indies Secure First Win) సాధించింది. ఒక బంతికి నాలుగు పరుగులు కావలసిన సమయంలో బంగ్లా కెప్టెన్ మహ్మదుల్లా (31) బంతిని కనెక్ట్ చేయలేకపోయాడు. దీంతో మూడు పరుగుల తేడాతో విండీస్ జట్టు విజయం సాధించింది. ఇప్పటికే రెండు ఓటములు మూటగట్టుకున్న విండీస్ సెమీస్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో సత్తా చాటింది. 143 పరుగుల లక్ష్యఛేదనలో బంగ్లా బ్యాట్స్‌మెన్ నెమ్మదైన ఆటతీరే వారి కొంపముంచింది. ఈ మ్యాచ్ విజయంతో వెస్టీండీస్ ముందుకు సాగగా, బంగ్లాదేశ్ ఇంటిదారి పట్టింది.
మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఇందులో వింతేముంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే తొలి 14 ఓవర్లలో విండీస్ చేసిన స్కోరు 70.. ఇందులో కేవలం మూడు బౌండరీలు మాత్రమే ఉన్నాయి. ఇక కోల్పోయిన వికెట్లు నాలుగు. ఇక 14వ ఓవర్ తర్వాత విండీస్ బాదుడు మొదలుపెట్టింది.ఎవరైనా వికెట్ పడితే ఒత్తిడికి లోనవ్వడం చూస్తుంటాం. కానీ విండీస్ మాత్రం ఒకవైపు వికెట్లు పోతున్నా బాదుడే లక్ష్యంగా పెట్టుకుంది. చివరి ఆరు ఓవర్లలో విండీస్ 72 పరుగులను రాబట్టింది. ఈ 72 పరుగుల్లో .. 50 పరుగులు.. బౌండరీలు, సిక్సర్లు(7 సిక్సర్లు, 2 ఫోర్లు ) రూపంలో రావడం విశేషం. నికోలస్ పూరన్(44), జేసన్ హోల్డర్(15) సిక్సర్ల వర్షం కురిపించారు.
లంకను చిత్తు చేసిన ఆస్ట్రేలియా, వార్నర్ దూకుడుతో చేతులెత్తేసి శ్రీలంక
విండీస్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక బంగ్లాదేశ్ 139/5కే పరిమితమైంది. బంగ్లా ఆటగాళ్లలో లిటన్ దాస్ 44 పరుగులు చేయగా, మహమ్మదుల్లా 31 పరుగులతో రాణించారు. నయీం 17 పరుగులతో, సౌమ్య 17 పరుగులతో ఫరవాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో రస్సెల్, హోసెన్, రవి రాంపాల్, బ్రావో, హోల్డర్ తలో వికెట్ తీశారు.