Bangladesh players wicket celebration against Pakistan (Photo Credit: X/@TheRealPCB)

పాకిస్థాన్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో నెగ్గి చరిత్ర సృష్టించిన ‘డార్క్ హార్స్’ బంగ్లాదేశ్ అనూహ్యంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లోకి దూసుకొచ్చింది. వచ్చే ఏడాది జూన్ 11న ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్న సంగతి విదితమే. ఈ రేసులో ఇండియా, ఆస్ట్రేలియాకు సవాలు విసిరేందుకు బంగ్లా సిద్దమైంది.న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు కూడా ఫైనల్స్‌లో చోటు కోసం పోరాడుతున్నాయి. పాక్ మీద టెస్ట్ సీరిస్ గెలిచిన బంగ్లా అనూహ్యంగా భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తర్వాతి స్థానంలో నిలిచింది.

డబ్ల్యూటీసీ ఫైనల్‌కి రెండుసార్లు చేరిన భారత్ ఈ  మూడోసారి కూడా అడుగుపెట్టనుంది. ప్రస్తుతం 68.52 శాతం పాయింట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టీమిండియా ఇంకా బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ ల ద్వారా రోహిత్‌ సేన 85.09 శాతంతో ఈ సీజన్‌ను ముగించే అవకాశం ఉంది.

బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్‌కు ఘోర పరాభవం, టెస్టు సిరీస్‌ క్లీన్ స్వీప్ చేసిన బంగ్లా, దాయాది దేశంపై టెస్టు సిరీస్‌ గెలవడం ఇదే మొదటిసారి

ఇక రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ప్రస్తుతం 62.50 శాతం పాయింట్లతో ఉంది. ఇది కూడా ఇండియా సహా ఏడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కాబట్టి ఆసీస్ 76.32 శాతం పాయింట్లతో రెండో ప్లేస్ లోకి రావొచ్చు. 2021 డబ్ల్యూటీసీ విన్నర్ అయిన న్యూజిలాండ్ చేతిలో ప్రస్తుతం 50 శాతం పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా శ్రీలంక, ఇండియా, ఇంగ్లండ్‌తో తలపడాల్సి ఉంది. ఈ లెక్కన కివీస్ 78.57తో ఈ సీజన్‌ను ముగించే అవకాశాలు ఉన్నాయి.

ఇక, డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులోకి దూసుకొచ్చిన బంగ్లాదేశ్‌ చేతిలో ప్రస్తుతం 45.83 శాతం పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా సౌతాఫ్రికా, ఇండియా, వెస్టిండీస్‌తో ఆడాల్సి ఉంది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ జట్లు ఫైనల్ రేసులోకి రావడం దాదాపు అసాధ్యం.