టీ20 క్రికెట్‌లో జింబాబ్వే (Zimbabwe) ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో ప్రపంచ రికార్డు సృష్టించింది. 20 ఓవర్లలో ఏకంగా 344 పరుగులు చేసింది. టీ20 ప్రపంచ కప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ టోర్నీలో భాగంగా గాంబియాపై 344/4 స్కోరు సాధించి చరిత్ర సృష్టించింది. జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా (133*; 43 బంతుల్లో 7 ఫోర్లు, 15 సిక్స్‌లు)లతో హోరెత్తించాడు. ఈ క్రమంలోనే జింబాబ్వే తరఫున అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఇప్పటి వరకు టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన రికార్డు నేపాల్ (314/3) పేరిట ఉండేది. 2023 ఆసియా క్రీడల్లో మంగోలియాపై నేపాల్ ఈ ఫీట్ సాధించింది. గాంబియాపై సికిందర్ రజాతోపాటు తడివానాశే మారుమణి (62; 19 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), బ్రియాన్ బెన్నెట్ (50; 26 బంతుల్లో), క్లైవ్ మండాడే (53*; 17 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) దంచికొట్టారు.
టీ 20ల్లో జింబాబ్వే వరల్డ్ రికార్డ్, ఏకంగా 344 రన్స్ చేసి సరికొత రికార్డు నెలకొల్పిన జింబాబ్వే
అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన గాంబియా 14.4 ఓవర్లలో 54 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో 10 మంది సింగిల్ డిజిట్ స్కోరుకు పెవిలియన్ చేరడం విశేషం. పదో స్థానంలో వచ్చిన ఆండ్రీ జార్జు (12) నాటౌట్‌గా నిలిచాడు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ 3, బ్రాండన్ మావుట 3, వెస్లీ మధ్వీర 2, ర్యాన్ బర్ల్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే 290 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో పరుగులపరంగా ఇదే అతిపెద్ద విజయం. అంతకుముందు ఈ రికార్డు నేపాల్ (290 పరుగులు, మంగోలియాపై 2023) పేరిట ఉండేది.
ఈ మ్యాచ్‌లో జింబాబ్వే భారీ స్కోరు చేయడం ద్వారా టెస్టులు ఆడే దేశాల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఇటీవల హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌పై భారత్ 297/6 చేసిన రికార్డును బ్రేక్ చేసింది.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోర్లు
జింబాబ్వే.. 344/4 (గాంబియాపై, 2024)
నేపాల్.. 314/3 (మంగోలియాపై, 2023)
భారత్.. 297/6 (బంగ్లాదేశ్‌పై, 2024)
జింబాబ్వే.. 286/5 (సీషెల్స్‌పై, 2024)
అఫ్గానిస్థాన్.. 278/3 (ఐర్లాండ్‌పై, 2019)
చెక్ రిపబ్లిక్.. 278/4 (తుర్కియేపై. 2019)
Tags :