దాదాపు నెల రోజులుగా ఖతర్ వేదికగా సాగిన సాకర్ సమరం (FIFA World Cup 2022) ముగిసింది. ఫిఫా వరల్డ్‌కప్-2022 ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించిన అర్జెంటీనా విశ్వ విజేతగా నిలిచింది. స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ సారథ్యంలో విజేతగా నిలిచి ముచ్చటగా మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది.మేటి ఆటగాడు మెస్సీకి ఘనమైన వీడ్కోలు లభించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో అదనపు సమయంలోనూ 3-3తో ఇరు జట్లు సమంగా ఉన్న వేళ.. పెనాల్టీ షూటౌట్ ద్వారా వరల్డ్‌కప్-2022 ఫైనల్ ఫలితం తేలిన విషయం తెలిసిందే. 4-2తో అర్జెంటీనా పైచేయి సాధించి విశ్వ విజేతగా అవతరించింది.
ఈ గెలుపు ద్వారా ప్రపంచకప్‌ను అత్యధిక సార్లు గెలిచిన జట్ల జాబితాలో అర్జెంటీనా మూడో స్థానానికి చేరుకుంది. బ్రెజిల్ (5 సార్లు) టాప్ ర్యాంక్‌లో, జర్మనీ (4 సార్లు), ఇటలీ (4 సార్లు) సంయుక్తంగా రెండో ర్యాంక్‌లో ఉన్నాయి.ఇక డిఫెండింగ్ చాంపియన్ తదుపరి టోర్నీ ఫైనల్లో ఓడిపోవడం ఇది మూడోసారి. గతంలో అర్జెంటీనా (1990లో), బ్రెజిల్ (1998లో) జట్లకు ఇలాంటి ఫలితమే ఎదురైంది. ఇప్పుడు ఆ లిస్టులో ఫ్రాన్స్ కూడా చేరింది.
ప్రపంచకప్ ఫుట్‌బాల్ టైటిల్ సాధించడం అర్జెంటీనాకిది మూడోసారి. గతంలో ఆ జట్టు 1978, 1986లలో సాధించింది.షూటౌట్’ ద్వారా ప్రపంచకప్ నెగ్గిన మూడో జట్టు అర్జెంటీనా. గతంలో బ్రెజిల్ (1994లో), ఇటలీ (2006లో) ఈ ఘనత సాధించాయి. అత్యధికంగా ఆరుసార్లు ప్రపంచకప్‌లో ‘షూటౌట్’లలో మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా అర్జెంటీనా గుర్తింపు పొందింది. ఇక వరల్డ్‌కప్-2022 అవార్డులు, విజేత, రన్నరప్, లీగ్ దశలో నిష్క్రమించిన జట్లకు దక్కిన ప్రైజ్‌మనీ (FIFA World Cup 2022 Prize Money) సహా ఇతర విశేషాలపై ఓ లుక్కేద్దాం.
ఎవరికెంత డబ్బు ముట్టిందంటే..
►విజేత: అర్జెంటీనా - 4 కోట్ల 20 లక్షల డాలర్లు (రూ. 347 కోట్లు)
►రన్నరప్: ఫ్రాన్స్ -3 కోట్ల డాలర్లు (రూ. 248 కోట్లు)
►మూడో స్థానం: క్రొయేషియా -2 కోట్ల 70 లక్షల డాలర్లు (రూ. 223 కోట్లు)
►నాలుగో స్థానం: మొరాకో -2 కోట్ల 50 లక్షల డాలర్లు (రూ. 206 కోట్లు)
►క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడిన జట్లకు (4) -కోటీ 70 లక్షల డాలర్ల చొప్పున (రూ. 140 కోట్ల చొప్పున)
►ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఓడిన జట్లకు (8) -కోటీ 30 లక్షల డాలర్ల చొప్పున (రూ. 107 కోట్ల చొప్పున)
►గ్రూప్ లీగ్ దశలో నిష్క్రమించిన జట్లకు (16) -90 లక్షల డాలర్ల చొప్పున (రూ. 74 కోట్ల చొప్పున)
వరల్డ్‌కప్–2022 అవార్డులు
గోల్డెన్ బాల్ (బెస్ట్ ప్లేయర్): లియోనల్ మెస్సీ (7 గోల్స్)- అర్జెంటీనా
గోల్డెన్ బూట్ (టాప్ స్కోరర్): కైలియన్ ఎంబాపె- 8 గోల్స్- ఫ్రాన్స్
గోల్డెన్ గ్లౌవ్ (బెస్ట్ గోల్‌కీపర్): మార్టినెజ్ (అర్జెంటీనా; 34 సార్లు గోల్స్ నిలువరించాడు)
బెస్ట్ యంగ్ ప్లేయర్: ఎంజో ఫెర్నాండెజ్ (అర్జెంటీనా)
మ్యాన్ ఆఫ్ ద ఫైనల్: లియోనల్ మెస్సీ
ఫెయిర్ ప్లే అవార్డు: ఇంగ్లండ్
1998, 2014 ప్రపంచకప్‌లలో 171 గోల్స్ చొప్పున నమోదు కాగా ఈ ప్రపంచ కప్ లో 64 మ్యాచ్ లు జరగగా 172 గోల్స్ నమోదు అయ్యాయి. ఒకే టోర్నీలో ఇవే అత్యధికం.ఈ టోర్నీలో 217 ఎల్లో కార్డులు, 3 రెడ్ కార్డులు నమోదు అయ్యాయి. టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన జట్టుగా ఫ్రాన్స్ నిలిచింది.