Handball Federation of India president A Jaganmohan Rao

హైదరాబాద్‌ మరో ప్రతిష్ఠాత్మక టోర్నీకి ఆతిథ్యమివ్వబోతున్నది. ఆసియా పురుషుల క్లబ్‌ లీగ్‌ హ్యాండ్‌బాల్‌ టోర్నీ హైదరాబాద్‌ వేదికగా జరుగనుంది. జూన్‌ 23 నుంచి జూలై 4వ తేదీ వరకు గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తామని జాతీయ హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌(హెచ్‌ఎఫ్‌ఐ) అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు గురువారం పేర్కొన్నారు. ఆసియా హ్యాండ్‌బాల్‌ సమాఖ్య ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్‌కే కేటాయించారని... ఆసియా నుంచి 12 లేదా 15 జట్లు ఈ మెగా టోర్నీలో పాల్గొంటాయని భారత హ్యాండ్‌బాల్‌ సమాఖ్య (హెచ్‌ఎఫ్‌ఐ) అధ్యక్షుడు అరిశనపల్లి జగన్‌మోహన్‌ రావు తెలిపారు.

ఈనెల 26న జరిగిన ఆసియా హ్యాండ్‌బాల్‌ ఫెడరేషన్‌(ఏహెచ్‌ఎఫ్‌) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ భేటీలో హెచ్‌ఎఫ్‌ఐకి ఆతిథ్య హక్కులు దక్కేలా జగన్‌ కీలక భూమిక పోషించారు. ఈ టోర్నీలో ఆతిథ్య భారత్‌, ఖతార్‌, జపాన్‌, చైనాతో పాటు 12 నుంచి 15 ఆసియా దేశాలు పాల్గొనే అవకాశముంది. కేంద్ర, రాష్ట్ర క్రీడాశాఖలు, సాయ్‌, సాట్స్‌ సహకారంతో టోర్నీ నిర్వహిస్తామని జగన్‌ పేర్కొన్నారు. టోర్నీ జరుగుతున్న రోజుల్లో ఏదో ఒక సమయంలో సీఎం కేసీఆర్‌ హాజరయ్యే అవకాశముందని ఆయన తెలిపారు. భారత్‌లో డీడీ స్పోర్ట్స్‌లో ప్రసారం కానుండగా, ఏహెచ్‌ఎఫ్‌ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌ అల్కాస్‌ ద్వారా మిగతా ఆసియా దేశాల్లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయని వివరించారు.