Tokyo Olympics 2020: టోక్యో ఒలంపిక్స్‌లో సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్న భారత రెజ్లర్ రవికుమార్ దహియా, ఫైనల్లో రష్యన్ ప్రత్యర్థి చేతిలో ఓటమి; పోరాట స్పూర్థిని మెచ్చుకున్న రాష్ట్రపతి మరియు ప్రధాని
Ravi Kumar Dahiya at Tokyo Olympics 2020 | (Photo Credits: PTI)

Tokyo, August 5: టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్‌ రవికుమార్‌ దహియా సిల్వర్ మెడల్ సాధించాడు. గురువారం జరిగిన 57 కిలోల రెజ్లింగ్‌ ఫ్రీస్టైల్‌ ఫైనల్స్ లో బంగారు పతకం సాధిస్తాడనుకున్న రవికుమార్ ఫైనల్లో పోరాడి ఓడిపోయాడు. 57 కిలోల రెజ్లింగ్‌ ఫ్రీస్టైల్‌ విభాగంలో రష్యాకు చెందిన రెజ్లర్‌ జవుర్‌ ఉగేవ్‌తో జరిగిన హోరాహోరి మ్యాచ్‌లో చివరి వరకు పోరాడిన రవికుమార్‌ 7-4 తేడాతో ఓడి రజత పతకం గెలుచుకున్నాడు.

2012 తర్వాత పురుషుల విభాగంలో భారత్ కు ఒలంపిక్స్ క్రీడల్లో పతకం రావడం ఇదే తొలిసారి. అంతకుముందు 2008లో బీజింగ్ ఒలంపిక్స్ క్రీడల్లో రెజ్లర్ సుశీల్ కుమార్ కాంస్య పతకం సాధించాడు.

23 ఏళ్ల దహియా భారతదేశపు అతి పిన్న వయస్కుడైన ఒలింపిక్ ఛాంపియన్ అవుతాడని అనుకున్నారంతా. ఎందుకంటే టోక్యో ఒలంపిక్స్ లో రవికుమార్ తొలి రౌండ్ నుంచి ప్రత్యర్థులపై దూకుడుగా ఆడుతూ వరుస విజయాలు సాధించాడు. తొలి రౌండ్‌లో కొలంబియా ప్రత్యర్థిపై 13- 2 తేడాతో ఘన విజయం, క్వార్టర్ ఫైనల్లో బల్గేరియా ప్రత్యర్థిపై 14-4 తేడాతో భారీ గెలుపు మరియు సెమీ ఫైనల్లో కజికిస్థాన్ ప్రత్యర్థిని 9-2 తేడాతో చిత్తు చేసి ఫైనల్ వరకు దూసుకెళ్లాడు. ఈ క్రమంలో రవికుమార్ దహియాపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే రెండుసార్లు డిఫెండింగ్ ప్రపంచ ఛాంపియన్ అయిన రష్యా ప్రత్యర్థి చేతిలో మాత్రం ఫైనల్లో గట్టి పోటీ ఎదురైంది. ఏదైమేనా రవి సిల్వర్ పతకాన్ని దేశానికి అందించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో ఇది భారతదేశానికి రెండవ రజత పతకం కాగా, మొత్తంగా ఐదవ పతకం.

Here it is: 

రవికుమార్ సిల్వర్ సాధించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. "రవి కుమార్ దహియా ఒక అద్భుతమైన రెజ్లర్! అతని పోరాట పటిమ మరియు దృఢత్వం అత్యద్భుతం. టోక్యో 2020 లో రజత పతకం సాధించినందుకు ఆయనకు అభినందనలు. అతని విజయాలపై భారతదేశం గొప్ప గర్వపడుతుంది". అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు,

"రవి దహియా రజతం గెలిచినందుకు భారతదేశం గర్వపడుతోంది మరియు దేశానికి కీర్తిని తెచ్చిపెట్టింది అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఒక నిజమైన ఛాంపియన్ లాగా పోరాడారు, సిల్వర్ గెలుచుకున్నారు. మీ ఆదర్శవంతమైన విజయాలకు అభినందనలు" అని రాష్ట్రపతి కోవింద్ ట్వీట్ చేశారు.