Switzerland, SEP 15: టెన్నిస్ దిగ్గజాల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న స్విస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ (Roger Federer ) టెన్నిస్‌కు వీడ్కోలు ప్రకటించాడు. ఈ మేరకు శనివారం సాయంత్రం సోషల్ మీడియా వేదికగా తన రిటైర్మెంట్ (announces retirement) ప్రకటన చేశాడు. ఈ నెల 23 నుంచి లండన్‌లో జరగనున్న లావెర్ కప్ ఏటీపీనే తన చివరి టోర్నమెంట్ అని వెల్లడించాడు. 1998లో టెన్నిస్ క్రీడలోకి అడుగుపెట్టిన రోజర్ ఫెదరర్ (Roger Federer) తన 24 ఏళ్ల కెరీర్లో ఎన్నో మైలురాళ్లు అందుకున్నారు. 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, ఎనిమిది వింబుల్డన్ ట్రోఫీలు, ఆరుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్, ఐదుసార్లు యూఎస్ ఓపెన్ (US Open), ఒక ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు సాధించారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ డబుల్స్ విభాగంలో స్వర్ణం, 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్ సింగిల్స్ విభాగంలో రజత పతకం అందుకున్నాడు. కొంతకాలంగా గాయాలతో బాధపడుతున్న 41 ఏళ్ల ఈ ఆటగాడు గత యూఎస్ ఓపెన్ టోర్నమెంట్‌లో కూడా పాల్గొనలేకపోయాడు.
To my tennis family and beyond,
With Love,
Roger pic.twitter.com/1UISwK1NIN
— Roger Federer (@rogerfederer) September 15, 2022
కాగా, తన 24 ఏళ్ల కెరీర్.. 24 గంటల్లా గడిచిపోయాయని ఫెదరర్ అన్నాడు. ఇక కెరీర్లో దాదాపు 1,500కు పైగా అంతర్జాతీయ మ్యాచులు ఆడిన ఫెదరర్ ర్యాంకింగ్స్‌లో కూడా సత్తా చాటాడు. 310 వారాలపాటు నెంబర్ 1 ర్యాంకులో కొనసాగడం విశేషం. 1998లో ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్‌గా మారిన అనంతరం కెరీర్‌లో మొత్తం 1526 సింగిల్స్ మ్యాచ్‌లు ఆడిన ఫెదరర్.. వీటిలో 1251 మ్యాచుల్లో గెలిచాడు.
అలాగే 103 సింగిల్స్ టైటిళ్లు సాధించాడు. వీటి ద్వారా సుమారు 13 కోట్ల డాలర్లు సంపాదించాడు. ‘ఇది చేదు నిర్ణయమే కానీ.. ఇప్పటి వరకు నాకు ఈ టూర్ ఇచ్చిన అనుభవాలను మిస్ అవుతానని నాకు తెలుసు’ అని తన రిటైర్‌మెంట్ సందేశంలో ఫెదరర్ చెప్పాడు. గతేడాది వింబుల్డన్‌లో చివరగా కాంపిటీటీవ్ మ్యాచ్ ఆడిన ఫెదరర్.. ఆ తర్వాత ఆటకు దూరమయ్యాడు. వచ్చే వారం జరిగే లేవర్ కప్‌లో అతను చివరగా పాల్గొననున్నాడు.